-జిల్లా రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందించిన ప్రతినిధి బృందం
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ ఒకటవ తేదీ నుండి భూముల మార్కెట్ విలువ పెంపు కోసం ప్రభుత్వం చేస్తున్న కసరత్తును వాయిదా వేయాలని జాతీయ స్ధిరాస్తి అభివృద్ది మండలి (నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్ మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) ప్రభుత్వానికి విన్నవించింది. శనివారం పూర్వపు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నారెడ్కో సెంట్రల్ జోన్ ప్రతినిధి బృందం పటమటలోని ఎన్ టిఆర్ జిల్లా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అధికారి (డిఐ) రవీంద్రనాధ్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నారెడ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షుడు ముక్తేశ్వరరావు మాట్లాడుతూ భూముల విలువ పెంపును ఒక సంవత్సరం వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం గందరగోళ పరిస్ధితిని ఎదుర్కోంటుందని, కోవిడ్ ముందు పరిస్ధితులతో పోల్చితే ఈ రంగంలో అమ్మకాలు ఎనభై శాతం మేర తగ్గిపోయాయని వివరించారు. రిజిస్ర్టేషన్ల శాఖ ఇందుకు సంబంధించిన పూర్త సమాచారాన్ని కలిగి ఉందని, ఫలితంగా ప్రస్తుతం ఈ రంగం అనుభవిస్తున్న కష్టాలు వారికి అవగతమేనని పేర్కొన్నారు. ప్రతినిధి బృందం కన్వీనర్ సందీప్ మండవ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం సమాజంలోని విభిన్న వర్గాల అభివృద్దిలో కీలక భూమికను పోషిస్తోందని, ఇప్పటికే పతనావస్ధలో ఉన్న ఈ రంగం రిజిస్టేషన్ల రుసుము పెంపుతో మరింత దిగజారుతుందని అన్నారు. ఇప్పడు స్ధిరాస్తి విలువలు పెంచితే ప్రభుత్వానికి అదాయం పెంపు సంగతి పక్కన పెడితే, ఇప్పటికే ఉన్న అదాయం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని సందీప్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దయతో ఈ విషయంపై పునరాలోచించాలని నారెడ్కో బృందం ఈ సందర్భంగా విన్నవించింది. కార్యక్రమంలో కోశాధికారి వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News