-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-రూ. 147.40 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు మున్సిపాలిటీలోని 9, 10 వార్డుల పరిధిలో సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన
-15వ ఆర్థిక సంఘం నిధులు రూ.99.50 లక్షలు, రుడా నిధులు రూ.47.90 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభం
-త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ
-గడిచిన ఐదేళ్ల కాలంలో నిడదవోలు పట్టణ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించిన వైసీపీ
-అతి త్వరలోనే మరో రూ.2 కోట్లతో పట్టణాభివృద్ధి శాఖ నుండి నిధులు మంజూరు.. రుడా, ఇతరత్రా మరో రూ. 1 కోటి నిధులు మంజూరు అయ్యే అవకాశం
-త్వరలోనే నిడదవోలులో 100 పడకల ఆస్పత్రి, స్టేడియం ఏర్పాటు.. మాల్గుడి చెరువు అభివృద్ధి, దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం.. పట్టణంలో సుందరీకరణకు పెద్దపీట వేస్తామన్న మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు పట్టణాభిృద్ధి కోసం అన్నిచోట్ల నుండి నిధులు సమీకరించి సమగ్రాభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ అన్నారు. రూ. 147.40 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు మున్సిపాలిటీలోని 9, 10 వార్డుల పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ నుండి వయా రామదాసు స్ట్రీట్ మీదుగా వీక్లీ మార్కెట్ జంక్షన్ వరకు నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైన్ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.99.50 లక్షలు, రుడా నిధులు రూ.47.90 లక్షలు వెచ్చించి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇవే కాకుండా మరో రూ.40 లక్షల నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొత్తంగా త్వరలో రూ.1 కోటితో మరిన్ని పనులు చేపడతామన్నారు. అంతేగాక నిడదవోలు పట్టణానికి పురపాలక,పట్టణాభివృద్ధి శాఖామాత్యులు నారాయణ కోటి రూపాయలు మంజూరు చేస్తే, ఆ నిధులు సరిపోవని రూ.3 కోట్లు కేటాయించాలని కోరానన్నారు. ఆయన మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారని త్వరలోనే రూ.2 కోట్ల నిధులు నిడదవోలు పట్టణాభివృద్దికి వస్తాయన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తాము ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనే విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామన్నారు. ఇదొక మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. ఇప్పటికే రుడా రూ.1 కోటి రూపాయలు నిధులు అందించిందని, ప్రస్తుతం మరో రూ.47.90 లక్షలు కేటాయించడం ద్వారా నూతనంగా రోడ్డు, డ్రైన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. నిడదవోలు చాలా చిన్న పట్టణమైనప్పటికీ గతంలో చాలా వైభవంగా వెలుగొందిన పట్టణమని మంత్రి గుర్తుచేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో నిడదవోలు పట్టణ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్రంతో పాటు నిడదవోలులో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందన్నారు.
గతంలో ఎలాంటి అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక అనుమతులు లేకుండా నిడదవోలు పట్టణంలో 100 పడకల ఆస్పత్రి చేపడుతామని కల్లబొల్లి కబుర్లు చెప్పి కొబ్బరికాయలు కొట్టారని నేటికీ అది కార్యరూపం దాల్చలేదని మంత్రి దుర్గేష్ అన్నారు. 100 పడకల ఆస్పత్రి నిర్మించాలంటే బిల్డింగ్ నిర్మాణం, ప్రధాన వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ కు జీతాలు తదితర అన్ని అనుమతులు అవసరమవుతాయి.. ఆ అనుమతుల కోసం తాను సీఎం చంద్రబాబునాయుడు, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, హెల్త్ సెక్రటరీ కృష్ణబాబులతో మాట్లాడానన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆర్థికపరమైన అనుమతులు ఇస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. నిరాంటకంగా పనులు సాగేలా త్వరలోనే నిడదవోలులో 100 పడకల ఆస్పత్రిని నిర్మించే కార్యక్రమం చేపడతామన్నారు.
నిడదవోలు పట్టణంలో సరైన స్టేడియం లేదని, వాకింగ్ ట్రాక్ లేదని పలువురు తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి దుర్గేష్ తెలిపారు. గతంలో ఇవి నిర్మిస్తామని పైపైన మాటలు చెప్పారే తప్ప వాటికి సంబంధించిన సరైన పత్రాలేవీ లేవన్నారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి స్టేడియం అనే కార్యక్రమంలో భాగంగా నిడదవోలులో స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా మాల్గుడి చెరువును అభివృద్ధి చేసి దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామన్నారు. పట్టణంలో సుందరీకరణకు పెద్దపీట వేస్తామన్నారు. బస్టాండ్ ఆధునికీకరిస్తామన్నారు. నిడదవోలు డిపో కు మేనేజర్ లేకపోతే రెండు మూడు రోజుల క్రిందటే నియమించేందుకు చర్యలు తీసుకున్నానన్నారు. విశాఖపట్నం, హైదరాబాద్ కు మరో సర్వీసు అవసరమని పట్టణ ప్రజలు కోరిన వెంటనే విశాఖపట్నానికి రెండో సర్వీసు ఏర్పాటు చేశామన్నారు. డిపోలో పాత బస్సులు ఉంటే నూతన బస్సులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే హైదరాబాద్ కు లగ్జరీ బస్సు సర్వీస్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు.
తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గ ప్రజలు తమ సమస్య ఏదైనా తన వాట్సాప్ కు సందేశం పంపిస్తే క్షణాల్లో సంబంధిత అధికారికి సమస్య పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా సంవత్సరకాలంగా నిడదవోలులో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శలు చేసిన వ్యక్తులెవరైతే ఉన్నారో వారు వీలైనంత త్వరగా కళ్లడాక్టర్ కు చూపించుకోవాలని సలహా ఇచ్చారు. ప్రజల్లో తిరిగితే ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుస్తుందని విమర్శలు చేసిన వారికి తెలిపారు. వినబడకపోతే ఈఎన్ టీ స్పెషలిస్ట్ కు చూపించుకోవాలని చురకలంటించారు.
కార్యక్రమం అనంతరం మెప్మా ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేవని మంత్రి దుర్గేష్ ను అభ్యర్థించగా వెంటనే స్పందించి సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక తహసిల్దార్ కార్యాలయం వేరే చోటుకి తరలివెళ్తుందన్న అపోహలకు చెక్ పెడుతూ నిడదవోలు పట్టణంలోనే ఎమ్మార్వో కార్యాలయం ఉంచాలని ఆర్డీవోకు సూచించారు. ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన జనసేన పట్టణ పార్టీ అధ్యక్షులను అభినందించారు.
కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ ఛైర్మన్ షేక్ వజీరుద్దీన్, పురపాలక సంఘం కౌన్సిలర్లు, జాయింట్ కలెక్టర్ చిన రాముడు, మున్సిపల్ కమిషనర్ టీఎల్ పీఎస్ఎస్ కృష్ణవేణి, ఆర్డీవో రాణి సుస్మిత, ఇతర అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News