తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభ మేళాలో ప్రయాగ్ రాజ్ లోని దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం స్థానిక భక్తులను భక్తి పారవశ్యానికి లోను చేసింది.
ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, మొదలైన పంచ సూక్తాలను అర్చకులు వల్లించారు. అభిషేకానంతరం తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. సహస్రధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తదనంతరం శ్రీ చక్రతాళ్వార్ ను మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ గంగా నదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ శ్రీ చక్రతాళ్వార్ కు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణ్ రెడ్డి, సూపరింటెండెంట్ గురు రాజస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.