-పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయాలి.
-ఆదానీతో జరిగిన అన్ని ఒప్పందాలు రద్దు చేయాలి.
-పెంచిన విద్యుత్ చార్జీల భారాలు ప్రభుత్వమే భరించాలి.
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
-సమావేశంలో మూడు తీర్మానాల ఆమోదం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇళ్ల స్థలాల సమస్యలపైన, విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాల్లో పేద ప్రజలను భాగస్వాములను చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక ప్రణాళిక బద్ధంగా పూర్తిస్థాయిలో పేదల వద్దకు వెళ్లి వారి నుంచి అర్జీలు స్వీకరించాలని, విద్యుత్ చార్జీల పెంపునకు గలకారణాలను వివరిస్తూ ఆ దిశగా మధ్యతరగతి వర్గాలనూ చైతన్యవంతుల్ని చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.
విజయవాడ దాసరిభవన్‌లో ఆదివారంనాడు సీపీఐ అన్ని జిల్లాల, నగర, పట్టణ కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమాఖ్య రాష్ట్ర స్థాయి నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి అధ్యక్షత వర్గంగా ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, గుంటూరు నగర సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి వ్యవహరించారు. తొలుత సమావేశంలో మూడు తీర్మానాలను ప్రవేశపెట్టారు. అందులో‘పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణంకోసం రూ.5లక్షల చొప్పున మంజూరు చేయాలని’తీర్మానాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు.‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా రాజీనామా చేయాలని’ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.‘రాష్ట్ర ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీల భారాలను ప్రభుత్వమే భరించాలనే’ తీర్మానాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ ప్రవేశపెట్టారు. ఈ మూడు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. వాటికి అనుబంధంగా వివిధ జిల్లా, నగర, పట్టణ కార్యదర్శులు చేసిన సూచనల్ని సమావేశం స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.
అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రసంగిస్తూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాల హామీ ఇచ్చిందని, ఆ హామీ సాధన కోసం పార్టీ శ్రేణులంతా ప్రజల్లో నిరంతరం మమేకమవ్వాలని సూచించారు. ఎవరైతే ఇళ్ల స్థలాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారో వారిని గుర్తించి.. అర్జీలు సమర్పించాలన్నారు. పట్టణాల్లోని వార్డులను ఎంచుకుని ఒక నిర్నీత సమయంలో ఇళ్ల స్థలాలులేని నిరుపేదలను గుర్తించి, వారి ద్వారా అర్జీలు స్వీకరించి ప్రణాళిక బద్దమైన ప్రజా ఉద్యమాలకు సమాయత్తం కావాలన్నారు. రాజీలేని పోరాటాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు సన్నద్దం కావాలని, ఆ దిశగా పార్టీ బలోపేతంపైనా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. సీపీఐ అంటేనే..పేదల పార్టీ అని..ఆ దిశగా పేదలంతా మన ఉద్యమాల్లో మమేకం కావాలన్నారు. పెరుగుతున్న ధరలపైనా నిర్వహించే పోరాటాల్లోనూ ప్రజలను భాగస్వాములు చేయాలని కోరారు. గతంలో తిరుపతి, కడప, గుంటూరు తదితర జిల్లాల్లో పేదల ఇళ్ల స్థలాల కోసం అర్జీల స్వీకరణకు పెద్దఎత్తున ప్రజా స్పందన వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తుచేశారు. ఎక్కడైతే భూ సమస్యలున్నాయో గుర్తించాలని, సుదీర్ఘకాలంపాటు కబ్జాదారుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి నిరంతర భూ పోరాటాలు చేపట్టాలన్నారు. నాడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచబోమని చంద్రబాబు, లోకేష్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజలపై రూ.15,484 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమవ్వడం దురదృష్టకరమన్నారు. ఆదానితో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాల వల్ల రాబోయే 25 సంవత్సరాలలో..రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ప్రజలపైన లక్షా 10వేల కోట్ల భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారించాలని, గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై మోపిన విద్యుత్ భారాలను విరమించుకోవాలని, ఆయా భారాలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
పేదల ఇళ్ల స్థలాలపై తీర్మానాన్ని ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన అనంతరం మాట్లాడుతూ..గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పటికీ, పేదలు ఆ స్థలాల పట్ల సుముఖత చూపలేదని, అవి నిరుపయోగంగా మారాయని గుర్తుచేశారు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయం కేవలం లక్షా 80వేలే ప్రకటించిందని, ఆ సాయంతో పునాదుల పూర్తికి కూడా చాలబోదని పేదలెవ్వరూ ముందుకు రాలేదన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈనెల 17న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం సిమెంట్, ఇసుక, ఇటుక, కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా గృహ నిర్మాణానికి రూ.5 లక్షలకు పెంచి మంజూరు చేయాలని కోరారు.
అమిత్‌షా రాజీనామా డిమాండ్‌పై తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరుస్తూ, అవమానిస్తూ రాజ్యసభలో వ్యాఖ్యలచేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలన్న దురుద్దేవ్యంతో మోదీ, అమిత్ షా ల నేతృత్వంలో మతవాదాన్ని నెత్తికెత్తుకుని బీజేపీ పాలకులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని జల్లి విల్సన్ ధ్వజమెత్తారు.
విద్యుత్ చార్జీల పెంపు తీర్మానాన్ని అక్కినేని వనజ ప్రవేశపెట్టి మాట్లాడుతూ, గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆదానీ కంపెనీలతో రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలతో పెద్దఎత్తున అవినీతి జరిగిందనీ..సీపీఐ మొదటి నుంచీ ఆరోపిస్తోందని ఆమె చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా ఆస్తులను ఆదానీకి అప్పనంగా అప్పజెప్పేందుకు వైసీపీ ప్రభుత్వం చీకటి ఒప్పందాలకు సిద్ధమైందని నాడు సీపీఐ చేసిన ఆరోపణలు వాస్తవాలుగా నేడు స్పష్టమవుతున్నాయని అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలపై ఎలాంటి విద్యుత్ చార్జీలు మోపబోమని, వీలైతే తగ్గిస్తామని ప్రకటించారని, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలపైరూ.15,484 కోట్ల విద్యుత్ భారాలను రాష్ట్ర ప్రజలపై మోపడం తగదన్నారు. ఆవుల శేఖర్, పి.దుర్గాభవాని మాట్లాడుతూ, ఇళ్ల స్థలాల సమస్యలపైన, విద్యుత్ చార్జీల పెంపుపైన ప్రజలను మనం చైతన్యవంతుల్ని చేద్దామని చెప్పారు. ఈ సమావేశంలో వేదికపైన
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి, జి.ఈశ్వరయ్య, జంగాల అజయ్ కుమార్, డేగా ప్రభాకర్ తదితరులున్నారు. వివిధ జిల్లాల్లోని నగరాలు, పట్టణాల కార్యదర్శులు ఇళ్ల స్థలాలు, భూ సమస్యలపైన, విద్యుత్ చార్జీల పెంపుపై చేపట్టబోయే కార్యాచరణ తదితర అంశాలపై తమ అభిప్రాయాల్ని తెలిపారు.