విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జ్ఞానవంతమైన సమాజం కోసం ప్రతి వ్యక్తి ఆచరించాల్సిన నైతిక విలువలను వెయ్యేళ్ళ క్రితమే ప్రజా కవి వేమన తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరం లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వేమన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి వ్యక్తి ఎలా జీవించాలి అనే అంశాలపై ఎన్నో వచన కవిత్వాలు, పద్యాలు యోగి వేమన రచించారన్నారు. ఆయన పద్యాలలో “విశ్వదాభిరామ వినురవేమ” అని వాక్యాన్ని తెలియని తెలుగువారు లేరన్నారు. యోగి వేమన తర్వాత తరంలో తెలుగు గడ్డపై జన్మించిన ఎంతోమంది కవులకు యోగివేమన మార్గదర్శకులుగా నిలిచారన్నారు. ఒక కవి అంతిమ లక్ష్యం సమ సమాజ స్థాపనే అనే అంశాన్ని 1000 సంవత్సరాల క్రితమే ఆయన ప్రబోధించారన్నారు. నేటి తరం కవులు, రచయితలు కూడా యోగివేమన ఆశించిన జ్ఞానవంతమైన సమాజ స్థాపన లక్ష్యంగా రచనలు చేయాలని సూచించారు. ప్రధానంగా నేటితరం విద్యార్థిని విద్యార్థులు యోగివేమన రచించిన వేల పద్యాలను కంఠస్థం చేయడం ద్వారా తెలుగు భాషపై పట్టు సాధించాలన్నారు. కుల మతాలకు అతీతమైన వేమన భావజాలాన్ని నేటి తరం పౌరులు తెలుసుకోవడం ద్వారా ప్రజా కవి యోగివేమన రచించిన పద్యాలకు సార్థకత చేకూరుతుందని కలెక్టర్ అన్నారు. కార్యక్రమం లో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మి నరసింహం డిఆర్ డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి రెట్టించిన ఉత్సాహంతో భారీగా తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ -అదరహో అనే విధంగా యువతను, ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు …