– సాగు వ్యయం తగ్గించి, ఆదాయం పెంచే లక్ష్యంతో పొలం పిలుస్తోంది కార్యక్రమం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించి, ఆదాయం పెంచే లక్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంతో రైతులను చేయిపట్టి నడిపిస్తోందని… ఆరోగ్యానికి భరోసా కల్పించే ప్రకృతి వ్యవసాయం దిశగా ముందడుగు వేయాలని గు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, దాములూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఎలా ఉంది? సాగుచేస్తున్న పంటలు, ఉపయోగిస్తున్న ఎరువులు, వాటి లభ్యత తదితర వివరాలను రైతులను అడిగారు. తాము సాగు చేస్తున్న శెనగ పంట (జేజీ-11) రకం ఎండిపోయి, దిగుబడి చాలా తగ్గిపోతోందని, ఈ నేపథ్యంలో పంట మార్పిడికి నీటి వసతిని దాములూరు పంపింగ్ స్కీమ్ ద్వారా అందించగలిగితే మొక్కజొన్న, జొన్న వంటి పంటలు వేసుకునేందుకు వీలవుతుందని రైతులు అన్నారు. అదేవిధంగా కర్నూలు ఆధోని శనగ రకం (ఎన్‌బీఈజీ 452) అందించాల్సిందిగా కోరారు. పశుసంవర్థక శాఖ ద్వారా పశుగ్రాసం పెంపకం, గోకులం షెడ్స్, కిసాన్ క్రెడిట్ కార్డు, పశువైద్య శిబిరాల గురించి డా. శైలు మాధురి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, వాటి పరిష్కారానికి ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భావితరానికి మంచి ఆరోగ్యం అందించేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. అదేవిధంగా అగ్రీ కనెక్ట్ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులను పొలానికి తీసుకెళ్లి ఇప్పటినుంచే నేల, పంటలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని, ఇందులో భాగంగా బుధవారం దాములూరు ఎంపీయూపీ స్కూల్ 8వ తరగతి విద్యార్థులను పొలానికి తీసుకెళ్లి శనగ పంటను చూపించడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీహెచ్ మధుసూదనరావు, మండల వ్యవసాయ అధికారి డి.శైలజ, గ్రామ వ్యవసాయ సహాయకుడు బి.నరేంద్ర కుమార్ నాయక్, గ్రామ రైతులు తదితరులు హాజరయ్యారు.