గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం జనవరి 25 వ తేదిన దేశ వ్యాప్తంగా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. నాగలక్ష్మీ పేర్కొన్నారు.
శనివారం 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. నాగలక్ష్మీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.యస్.బి.జి.పార్థ సారధి , నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు , డిఆర్ఓ షేక్. ఖాజవలి , ఆర్డిఓ శ్రీనివాస రావు , నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఓబులేశు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ 1950 జనవరి 25 న ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడి ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. 2011 వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25 వ తేది ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిన తేదీని ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత దేశం అత్యంత ప్రజాస్వామిక దేశ మన్నారు. గత 75 సంవత్సరాలుగా ఎన్నికల విధానంలో ఎన్నో మార్పులను ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిందని వెల్లడించారు. చేయి ఎత్తి ఎన్నుకునే దగ్గర నుండి బ్యాలెట్ పేపర్ తో ఓటు నుండి ఈవీయం ల ద్వారా ఓటు వేసే వరకు మార్పులు వచ్చాయన్నారు. ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు , దివ్యాంగులు , సీనియర్ సిటీజన్లకు , కుల మతాలకు అతీతంగా , లింగ వివక్ష లేకుండా ఓటు హక్కును కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు దివ్యాంగులకు , సీనియర్ సిటీజన్లకు హోమ్ ఓటింగ్ కల్పించడం జరిగిందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో ఎన్నికలు నిర్వహిస్తున్నపుడు అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి పెడుతుందన్నారు. డబ్బుకు, ప్రలోభాలకు లొంగకుండా స్వచ్చంధంగా ఓటు వేయడం మన నుండే ప్రారంభమయ్యేట్లు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న ఆయుధమని , రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును జిల్లాలో నమోదు అయిన ప్రతి ఓటరు వినియోగించుకుని ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని కోరుతున్నానన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.యస్.బి.జి.పార్థ సారధి మాట్లాడుతూ గత సంవత్సరం నేను ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకున్నానన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకుని ఓటింగ్ సందర్భంలో తప్పక తమ ఓటును వేయాలన్నారు. ఓటు హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన ఉచిత హక్కుగా భావించకుండా డబ్బు ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతగా ప్రతి పౌరుడు తమ ఓటును సద్వినియోగపరచుకోవాలన్నారు. భారత పౌరునిగా అది మన బాధ్యత అన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలియజేయాలనే ఉద్దేశంతో అనేక విధాల ప్రచార కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు కలిగి వుండి కూడా ఓటు వేయకపోవడం సరికాదన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రతి నెల జిల్లా ఎన్నికల అధికారి వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును సమర్దవంతంగా ఉపయోగించుకోవాలన్నారు.
సీనియర్ సిటిజన్ మరియు రాజకీయ పార్టీ ప్రతినిధి కంచర్ల శివరామయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పట్టుకొమ్మ అని , ప్రశాంతంగా అధికార మార్పిడి జరుగుతుందన్నారు. ప్రభుత్వాలు , పార్టీలు తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారని , ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిన బాధ్యత అందరి మీద వుందన్నారు. గ్రామ పంచాయితీ సర్పంచ్ నుండి , మున్సిపాలిటీ , శాసన సభ్యుల ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. టెక్నాలజీ వచ్చిన తరువాత చాలా త్వరగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. 2024 లో జరిగిన ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నానన్నారు.
ఈ సందర్భంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్డిఓ కె. శ్రీనివాసులు “ భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్ష్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ణ చేస్తున్నామని ” ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లను సత్కరించడం జరిగింది. సభలో భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మిశ్రా ప్రసంగాన్ని ప్రదర్శించడం జరిగింది. క్రొత్తగా ఓటరుగా నమోదు అయిన యువతకు ఎపిక్ కార్డులు అందించారు. జాతీయ ఓటర్ల సందర్బంగా విద్యా సంస్థల్లో నిర్వహించిన వక్తృత్వ పోటీలు , వ్యాస రచన , డ్రాయింగ్ , స్లోగన్స్ , క్విజ్ పోటీలలో విజేతలైన విద్యార్దులకు బహుమతి ప్రదానం చేశారు. ఎన్నికల విధుల్లో ప్రతిభకనపరచిన గుంటూరు ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , తహశీల్దార్లు వెంకటేశ్వర్లు , నగేష్ లను మెమెంటో మరియు శాలువాలతో సత్కరించారు. విధుల్లో ప్రతిభ చూపిన ఈఆర్ఓ లు , ఏఈఆర్ఓ లు, బియల్ ఓ లను ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులకు మెమెంటోలు అందించి సత్కరించారు. శారదా నికేతన్ విద్యార్దులు , ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్దినులు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రదర్శించిన స్కిట్ లు సభికులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడి ఉమాదేవి , డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ , జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి , మైనారిటీ కార్పొరేషన్ ఈడి ప్రేమ్ కుమారి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి వీరాచారి , విద్యార్దులు , సీనియర్ , యువ ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …