– ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స
– అత్యాధునిక టిప్స్ చికిత్స ద్వారా రోగి లివర్ లో స్టెంట్ అమరిక
– పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్న పేషెంట్
– వివిధ విభాగాల నిపుణుల సమన్వయంతో అను అద్భుత విజయం
– దాదాపు 40 రోజులు శ్రమించి ప్రాణాన్ని కాపాడిన అను వైద్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని అను హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స నిర్వహించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్.. చికిత్సానంతరం చక్కగా కోలుకున్నారు. దాదాపు 40 రోజుల పాటు చికిత్సనందించిన అను వైద్యులు.. పేషెంట్ ప్రాణాలను కాపాడి అద్భుతం చేశారు. ఈ అత్యంత అరుదైన, అతి క్లిష్టమైన చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు అను హాస్పిటల్లో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ.. అనేక ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి తమ హాస్పిటల్ నందు విజయవంతంగా చికిత్స అందించామన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, సర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో కృషి చేశారని తెలిపారు. దాదాపు 40 రోజులు చికిత్స అందించి రోగి పూర్తిగా కోలుకునేలా చేసిన అను వైద్య బృందానికి డాక్టర్ జి. రమేష్ అభినందనలు తెలియజేశారు. ఈ విజయం అను కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం, ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీశంకర్ మాట్లాడుతూ.. ‘లివర్ ఫెయిల్యూర్ తో పొట్టలో నీరు చేరడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, హిమోగ్లోబిన్ క్షీణించడం, ఎడమ కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో మోకాలు కింది నుంచి పాదం వరకు పెద్ద గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అను హాస్పిటల్లోని బహుళ విభాగాల ఆధ్వర్యంలో చికిత్స నిర్వహించాం. టిప్స్ అనే విధానంలో లివర్ లో స్టెంట్ వేసి, లివర్ ఫంక్షనింగ్ మెరుగుపరిచాం. తద్వారా, పొట్టలో నీరు చేరకుండా నియంత్రించాం. కాలికి గ్రాఫ్టింగ్ చేసి గాయాన్ని నయం చేయగలిగాం. హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ స్థాయిలను మెరుగుపరిచి ప్రాణాపాయం తప్పించగలిగాం. దాదాపు 40 రోజుల చికిత్స ఫలితంగా పేషెంట్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జయ్యారు’ అని తెలిపారు. వివిధ విభాగాల వైద్య నిపుణులు, అత్యాధునిక సాధనా సంపత్తి ఒకే చోట ఉండటం ద్వారా, ఈ అత్యంత క్లిష్టమైన ఈ చికిత్సను అను హాస్పిటల్స్ నందు విజయవంతంగా నిర్వహించగలిగామని డాక్టర్ భవానీశంకర్ తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సతీష్ చైతన్య, డాక్టర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.