Breaking News

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో కాలిన గాయాలతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఆదివారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ముందుగా ఐసీయు లో చికిత్స పొందుతున్న వారిని , జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియా వారితో మాట్లాడుతూ 24 వ తేది శుక్రవారం రాత్రి ఏలూరు జిల్లా మందవల్లి మండలం శోభనాద్రిపురం గ్రామంలో ప్రమాదవశాత్తో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది గాయపడగా , అందులో ఏడుగురిని మెరుగైన వైద్య సేవలు అందించడానికి గుంటూరు జీజీహెచ్ కు తీసుకురావడం జరిగిందన్నారు. దురదృష్టవశాత్తో ఈ రోజు ఉదయం మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందడం జరిగిందన్నారు. 80 శాతం కాలిన గాయాలతో ఐసియులో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుందని , మిగిలిన నలుగురికి 50 నుండి 60 శాతం కాలిన గాయాలు అయ్యాయన్నారు. వీరి కుటుంబాలను పరామర్శించి పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. వీరంతా చాలా పేద కుటుంబాలకు చెందిన వారని , రోజు వారి కూలి చేసుకొని జీవించే వారని ,జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏలూరు , గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారన్నారు. గుంటూరు జీజీహెచ్ లో బర్నింగ్ వార్డు లేకపోవడం ఖచ్చితంగా ఒక లోటేనని , బర్నింగ్ వార్డు ఆవశ్యకత ఎంతైనా వుందని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధులు అందరూ ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. జీజీహెచ్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా , రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా మంచి ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కె.శ్రీనివాస రావు , డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ , జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.యస్.యస్.వి.రమణ , గుంటూరు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వేంకటేశ్వర రావు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *