-విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బంది లేకుండా మంత్రి గొట్టిపాటి చర్యలు
-6,7,8,9 తరగతుల వారికి త్వరలోనే మరో 10 వేల సైకిళ్ల పంపిణీకి ప్రణాళిక
-రోటరీ క్లబ్ నెదర్లాండ్స్ సాయంతో విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన మంత్రి గొట్టిపాటి
అమరావతి/అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజకవర్గంలో అద్దంకి లోని గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుల వైపు ప్రోత్సహించేలా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మరో కీలక ముందడుగు వేశారు. సుదూర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు అద్దంకి పట్టణానికి వస్తున్న పేద విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థినులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా తమ చదువులు కొనసాగించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకాంక్షించారు. అద్దంకి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 8,9 తరగతుల బాలికలకు సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మంత్రి గొట్టిపాటి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. సొంత నిధులు, నెదర్లాండ్స్ రోటరీ క్లబ్ తో పాటు కొందరు దాతల సహాయంతో విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. విద్యార్థినులకు సైకిళ్లను అందజేసిన అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మిగిలిన వారితో చదువులో పోటీ పడాలని అభిలషించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది పేదలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేస్తుంటారని వెల్లడించారు. అటువంటి వారు స్కూల్ కు రావాలన్నా సరైన రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రవాణా సదుపాయం లేక చదువులు ఆగకూడదన్న మంత్రి గొట్టిపాటి… అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు 40 ప్రభుత్వ పాఠశాలల బాలికలకు సైకిళ్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. మంత్రి గొట్టిపాటి ఔదార్యానికి… విద్యార్థులు తమ కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.
రూ.5 కోట్ల వ్యయంతో … ఏడాదిలో 10 వేల సైకిళ్ల పంపిణీ…
ప్రస్తుతం 8,9 తరగతుల బాలికలకు సైకిళ్లు ఇచ్చామని తెలిపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్…, ఇక్కడకు వచ్చిన తరువాత 6,7 తరగతుల విద్యార్థినులకు సైకిళ్ల అవసరాన్ని గుర్తించి వారికి కూడా 20 రోజుల్లో అందజేస్తామని హామీ ఇచ్చారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల బాలికలకు సుమారు 10 వేల సైకిళ్లు అవసరమని గుర్తించి.. వాటిని కూడా ఏడాదిలో అందజేస్తామని ప్రకటించారు. రోటరీ క్లబ్ నెదర్లాండ్స్ వారి సహాయం, దాతల సహకారంతో పాటు సొంత నిధులతో నియోజకవర్గ బాలికలందరికీ సైకిళ్లను సమకూర్చుతామని ఆయన హామీ ఇచ్చారు. అందరికీ సైకిళ్లు అందజేయడానికి సుమారు రూ. ఐదు కోట్లకు పైగా వ్యయం అవుతుందని., సంవత్సరంలోపు అందరికీ సైకిళ్లను అందజేస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అదే విధంగా అద్దంకి ప్రభుత్వ పాఠశాలలో మరో ఐదు తరగతి గదులు కావాలని పాఠశాల యాజమాన్యం కోరారని… విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తరగతుల నిర్వహణకు మరో ఐదు గదులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్ట్ డైరెక్టర్ జాస్తి రంగారావు, రోటరీ క్లబ్ నెదర్లాండ్స్ ప్రతినిధులు లియో జ్వాగ్ మేకర్, కీస్ వాన్డెన్ బెర్గ్, కోన్ వెస్సర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.