-కార్మికులకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నుండి కొత్తగా తీసుకుంటున్న పరిస్థితుల కార్మికుల పోస్టులకు డ్వాక్రా గ్రూపులలో ఉండి ఇప్పటికే కాంట్రాక్ట్ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సీనియారిటీ ప్రకారం పోస్టులలో అవకాశం కల్పించాలని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం అయినది. ఈ సందర్భంగా యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, మినిస్ట్రీయల్ అల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు రారా రాంబాబు తదితరులు, తుపాకుల ప్రతాప్ తదితరులు కమిషనర్ గారిని కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా నగరంలో అదనపు పారిశుద్ధ్య కార్మికుల అవసరం ఏర్పడినప్పుడు అనగా కరోనా, దసరా, భవాని మాలలు, స్వచ్చ సర్వేక్షన్, సిల్ట్ తొలగింపు, ఎన్నికలు, అత్యవసర పనులు మరియు ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలు సందర్భంగా సుమారు 60 మంది కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ గా పనిచేయుచున్నారని అన్నారు. నగరంలో జరుగుతున్న ముఖ్యమైన కార్యక్రమాలలో పారిశుద్ధ్య కార్మికులు అవసరమైనప్పుడల్లా వీరు వచ్చి పని చేయుచున్నారని, వీరందరికీ పారిశుధ్య పనుల పట్ల పూర్తి అవగాహన ఉందని అన్నారు. వీరందరూ కూడా ఎప్పటినుండో డ్వాక్రా గ్రూపులలో కూడా ఉన్నారని తెలిపారు. వారి శుద్ధ కార్మికుల పోస్టులలో రాజకీయాలకు చేరాయని, పనిచేసే కార్మికులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ నుండి అదనంగా తీసుకోనున్న పారిశుధ్య కార్మికుల పోస్టులకు సీనియారిటీ ప్రకారం తీసుకోకపోతే ఏఐటీయూసీగా ఉద్యమం చేస్తామని అన్నారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలిపారు. తక్షణం రాజకీయాలు మానుకొని కష్టపడే వారికి అవకాశం కల్పించాలని కోరారు.