Breaking News

సింహాచలం పంచగ్రామాల సమస్యకు పరిష్కారం

-పంచగ్రామాల్లోని 12,149 ఇళ్లను క్రమబద్దీకరించాలని నిర్ణయం
-610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు సంసిద్దం
-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం
-రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు త్వరలో ప్రభుత్వం పరిష్కారం చూపనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన రెవిన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో రాష్ట్ర సచివాలయంలో నేడు జరిగిన సమావేశంలో ఈ సమస్యకు సంబందించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో విశాఖపట్నానికి చెందిన పలువురు శాసన సభ్యులతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పంచగ్రామాల్లోని 12,149 ఇళ్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇందుకై ప్రత్యామ్నయంగా దాదాపు రూ.5,300 కోట్ల విలువ చేసే 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సింహచల దేవ స్థానం అనువంశిక ధర్మకర్త అయిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా ఆమోదాన్ని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఈ సమస్యకు సంబందించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.పై పలువురు కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఆ కేసులను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

2014-19 మద్య కాలంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు జి.ఓ.నెం. 338, 296 లను ను జారీ చేశామన్నారు. ఈ జీవోల కింద విశాఖలో 70 వేల మంది క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ జి.ఓల ప్రకారం రెండేళ్ల కాల వ్యవధిలో ఆ భూములపై లబ్దిదారులకు అన్ని హక్కులు సంప్రాప్తం అయ్యే విధంగా కన్వేయన్సు డీడ్ కూడా ఇవ్వాలని స్పష్టం చేయడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం ఆ జి.ఓలను పట్టించుకోకుండా లబ్దిదారులకు న్యాయం చేసే విధంగా స్పందించ లేదన్నారు. తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక శాసన సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అందుకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అయితే జి.ఓ.ను 2017 జారీ చేసిన నేపథ్యంలో అప్పటి నుండే ఈ భూములను క్రమబద్దీకరించాలని, అప్పటి నుండి రెండేళ్ల కాలవ్యవధి పూర్తి అయిన వాటికి కన్వేయన్సు డీడ్లును కూడా జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదే విధంగా రైతులు సాగు చేసుకునే భూములు, కొన్ని కాళీ స్థలాలకు సంబందించి కోర్టులో పలు కేసులు ఉన్నందున, వాటిని కూడా పరిష్కరించరించేందుకు దశల వారీగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. యు.ఎల్.సి.లోని అదనపు భూములు ఏవైనా ఆక్రమణకు గురైనా, వాటిని పి.ఓ.టి. చట్టం ప్రకారం పదేళ్ల కాల వ్యవధిలో అలియనేట్ చేయాల్సి ఉందని, అయితే అటు వంటి భూములకు కూడా రెండేళ్ల కాలవ్యవధిలోనే కన్వేయన్సు డీడ్లును ఇచ్చేందుకు ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గాజువాక ఇనాం భూముల క్రమబద్దీకరణకు సంబందించి తమ ప్రభుత్వం 2018లో జి.ఓ.నెం.301 ను జారీచేయగా ఆ జి.ఓ. ప్రకారం దాదాపు 7 వేల మంది ధరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా పూర్తి కాకుండా అపరిష్కృతంగా ఉన్నందున, తిరిగి ఆ జి.ఓ.ను కూడా సవరించి నూతన మార్గదర్శకాలతో నూతన జి.ఓ.ను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సింహాచలం దేవస్థానం భూమి సుమారు 420 ఎకరాలు ఆక్రమణకు గురై వాటిలో దాదాపు 12,149 ఇళ్లను నిర్మించుకోవడం జరిగిందన్నారు. అయితే ఆ ఇళ్లను క్రమబద్దీకరించేందుకు గతంలో తమ ప్రభుత్వం జి.ఓ.నెం.229 నూ జారీ చేస్తూ 420 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో చోట ఇచ్చేందుకు, క్రమబద్దీకరణ క్రింద వచ్చే ఫీజను కూడా దేవస్థానానికి ఇచ్చేందుకు నిర్ణయించండమైందన్నారు. అయితే ఆక్రమణకు గురైన దేవస్థానం భూమి విలువకు తగిన భూమిని ఇవ్వాలని కోరుతూ కొంత మంది కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాలు (సమాన రిజిస్ట్రేషన్ విలువతో) సింహాచలం దేవస్థానానికి బదలాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీని రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ.5,300 కోట్ల వరకూ ఉందన్నారు. పెదగంట్యాడ, గాజువాక, గొల్లలపాలెం తదితర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానానికి 610 ఎకరాల భూమి ఇస్తున్నామన్నారు. దేవస్థానానికి అవసరమైన చందనం చెట్లను పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట భూమి ఇస్తున్నామన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కోర్టులో కౌంటరు ఫైల్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండు మూడు మాసాల్లో ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గాజువాకలో ఇనాం భూమిని క్రమబద్ధీకరించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ భూముల క్రమ బద్దీకరణకు సంబందించి 2015-16 సంవత్సరంలో జి.ఓ. నెం. 301 ను జారీ చేయడం జరిగిందని, దాని కట్ ఆఫ్ తేదీ 2017 తో ముగిసిందన్నారు. అయితే ఆ కట్ ఆఫ్ తేదీని 31.12.2023 వరకూ పొడిగస్తూ నూతన జి.ఓ. ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇందు వల్ల మరో ఆరు వేల మందికి లబ్ది చేకూరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

విశాఖపట్నం పశ్చిమ నియోజక వర్గం శాసన సభ్యులు పి.జి.వి.ఆర్.నాయుడు (గణబుబ) మాట్లాడుతూ సింహాచలం భూముల క్రమబద్దీకరణ విషయంలో 1998 లో తమ ప్రభుత్వ హయాంలోనే జి.ఓ.నెం.578 ను జారీ చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా చాలా మంది క్రమబద్దీకరణ చేసుకోవడం జరిగిందన్నారు. తదుపరి ఏ ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. తిరిగి 2014-19 కాలంలోనే తమ ప్రభుత్వమే జి.¬ఓ. నెం.229 ను జారీ చేసి సింహాచల భూముల క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అయితే ఇప్పడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కోర్టులో ని కేసు కూడా పరిష్కారం అవుతుందని, దాదాపు 70 శాతం మందికి న్యాయం చేకూరుతుందని ఆయన తెలిపారు. అదే విధంగా భూముల క్రమబద్దీకరణకు గతంలో తమ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం.296 మరియు 388 లను విశాఖపట్నం వాసులే ఎక్కువగా వినియోగించుకోవడం జరిగిందన్నారు.

విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్సు అండ్ ఇన్ప్రాస్ట్రక్చర్ డవలెప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీ కృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *