సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ నియంత్రణ

-మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ప్రపంచంలోని అన్ని దేశాలకూ పెను సవాలుగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17.5 శాతం మేర కేవలం క్యాన్సర్ వ్యాధి కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో 9.93శాతం మేర క్యాన్సర్ మరణాలు నమోదవుతున్నాయన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన లేకపోవటం, నివారణ చర్యలు చేపట్టకపోవటం, ముందస్తు పరీక్షలు నిర్వహించకపోవటం, తద్వారా సరైన చికిత్స అందకపోవటం ఇందుకు కారణాలుగా భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధిపై అవగహన లేని కారణంగా ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. అయితే క్యాన్సర్ వ్యాధి సోకిన వారిలో 65 శాతానికిపైగా సరైన చికిత్స ద్వారా వ్యాధిని తగ్గించుకుని పునర్జీవనం పొందుతున్నారన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం వుందన్నారు. జన్యుపరమైన క్యాన్సర్ కు తప్ప, ఇతర రకాలైన క్యాన్సర్ వ్యాధులన్నింటికి ప్రస్తుతం చికిత్స అందుబాటులో వుందన్నారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి క్యాన్సర్ మరణాలను తగ్గించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినంగా పాటిస్తున్నామని మంత్రి వివరించారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు వైద్య పరీక్షలను పెద్దయెత్తున నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. గత నవంబర్ 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి పైగా ప్రజలకు క్యాన్సర్ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రధానంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాధులకు ప్రస్తుతం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. దానికి అనుగుణంగా 1500 బృందాలను నియమించామన్నారు. ఇందులో 155 మంది సూపర్ స్పెషలిస్టులు, 238 మంది స్పెషలిస్టులను, 4 వేల మంది ఎఎన్ఎంలు, 4 వేల మంది వైద్యాధికారులు, 18 వేల మంది ఆరోగ్య కార్యకర్తలను బృందాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. వీరి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో వున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకూ 71 లక్షల మందికి పైగా ప్రజలకు ప్రాథమిక క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా ఇందులో 66 వేల మంది అనుమానితులుగా తేలారన్నారు. వీరిని బోధనా ఆస్ప్రతులకు చెందిన ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్లకు రిఫర్ చేశామని తెలిపారు. అక్కడ వారికి వ్యాధి సోకిందా లేదా అన్న విషయాన్ని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారిస్తారన్నారు. దీనికోసం ప్రతి ఆస్పత్రిలో ప్రతి మంగళవారం, గురువారంలలో గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేసి రద్దీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే వ్యాధిపై అవగాహన లేకపోవటం వల్ల ప్రజలు అనేక ప్రాంతాల్లో ఈ పరీక్షలకు ముందుకు రావటం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మహిళా రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని, అదే విధంగా 30 ఏళ్ళు దాటిన ప్రతి మహిళా సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం వుందని ఆయన సూచించారు. మహిళలు మొహమాట పడకుండా హెల్త్ వర్కర్లు వచ్చినపుడు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వారికి సహకరించాలని కోరారు. తద్వారా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి వారి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం వుంటుందన్నారు. సమిష్టిగా పోరాటం చేసి కరోనా వ్యాధిని ఏ విధంగా నియంత్రించామో అదే విధంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, మీడియా సమిష్టిగా క్రుషి చేసి క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్యాన్సర్ వ్యాధిని జయించిన సినీ నటి గౌతమి ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సహకరిస్తానని ప్రభుత్వానికి చెప్పారని, ఇందుకు ఆమెకు తాను ధన్యవాదాలు తెలియచేస్తున్నానని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. జీవనశైలి, ఆహారపుటలవాట్లలో మార్పుల ద్వారా క్యాన్సర్ వ్యాధిని మనం నియంత్రించుకోవచ్చని ఆయన తెలిపారు. రాబోయే మూడేళ్ల కాలంలో ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ సహకారం తో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. క్యాన్సర్ నివారణ కు ప్రభుత్వం చేస్తున్న క్రుషిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *