-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూర్యారాధన వల్ల మనో వికాసం కలుగుతుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని మంగళవారం బుడమేరు వంతెన వద్దనున్న శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమస్త జగతికీ మూలాధారం.. కాలానికి అధిపతి అయిన సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు రథసప్తమి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారని.. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి అని తెలిపారు. అలాంటి సమయంలో చేయాల్సిన కొన్ని పనులు చేయటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాకుండా.. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందన్నారు. సూర్యారాధన చేయడం వల్ల సద్గుణం, మానసిక, శారీరక బలం కలగడమేకాక సర్వపాపాలూ తొలగుతాయన్నారు. ఆ సూర్యభగవానుడి కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి, ఆనందం, సంపద, ఆరోగ్యం కలగాలని.. అలాగే అభయ ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.