-శ్రీ వల్లీదేవసేన సమేతుడైన శ్రీ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు
-షష్ట షణ్ముఖ క్షేత్ర దర్శనం ఆనందాన్నిచ్చింది
-ప్రజలందరికీ శ్రీ సుబ్రహ్మణ్యుడు సుఖశాంతులు కలిగించాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తమిళనాడులోని తిరుత్తణిలో కొలువైన శ్రీ వల్లీదేవసేన సమేతుడైన శ్రీ మురుగన్ స్వామిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా తిరుత్తణి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ పండితులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. వినాయకుడి దర్శనానంతరం సుబ్రహ్మణ్యుని దర్శించుకున్నారు. తిరుత్తణిలో మాత్రమే ఆరు ముఖాలతో కూడిన మూర్తి దర్శనమిస్తారు. అనంతరం గర్భాలయంలో బంగారు కవచం, బిల్వపత్రమాలాధరుడు అయిన శ్రీ అర్ములిగు మురుగన్ స్వామికి పూజలు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్య విశిష్ట మంత్రోచ్ఛరణలతో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి, పంచహారతులు ఇచ్చారు. అనంతరం స్వామికి కుడి వైపున కొలువైన శ్రీ వల్లీ అమ్మవారిని, ఎడమ వైపు వెలసిన శ్రీ దేవసేన అమ్మవార్లను, ఆలయంలో ఉత్తరాన్న ఉన్న శ్రీ దుర్గాదేవిని, పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజల అనంతరం, ఆలయ మంటపంలో అర్చకస్వాములు వేదాశీర్వచనాలు, స్వామివారి చందన ప్రసాదం అందజేశారు. పవన్ కళ్యాణ్ నిఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి చిత్ర సత్కరించారు. పవన్ కళ్యాణ్ తోపాటు ఆయన తనయుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు తిరుత్తణి శ్రీ మురగన్ ను దర్శించుకున్నారు.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాల దర్శనం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, కుమార స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తిరుత్తణి దర్శనంతో పవన్ కళ్యాణ్ షష్ణ షణ్ముఖ క్షేత్ర యాత్ర పరిపూర్ణమయ్యింది.