గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ప్రజారోగ్యానికి భంగం కల్గించే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ కేటాయించిన పారిశుధ్య పనులకు ముందస్తు అనుమతులు లేకుండా గైర్హాజరు అయితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆదివారం నగరంలో పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికులు ఎక్కువ మంది ముందస్తు అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరు కావడం తమ దృష్టికి వచ్చిందని, కార్మికులను ప్రలోభపెట్టి ప్రజారోగ్యానికి భంగం కల్గించడానికి కొంత మంది అనధికార వ్యక్తులు ప్రేరేపిస్తున్నారన్నారు. గైర్హాజరైన కార్మికులకు ఆబ్సేంట్ మార్క్ చేయాలని ఇన్స్పెక్టర్లను ఆదేశించామన్నారు. ఆదివారం నగర ప్రజల నుండి పారిశుధ్య సమస్యలపై అనేక ఫిర్యాదులు అందాయని, నగర ప్రజల ఆరోగ్యానికి మెరుగైన పారిశుధ్యం కీలకమని, అటువంటి పారిశుధ్య పనులను ఆటంకం చేసే వారిపై తక్షణం విచారణ చేయిస్తున్నామన్నారు. విచారణ అనంతరం జిఎంసి కార్మికులు అయితే వారిపై క్రమశిక్షణ చర్యలు, అనధికార వ్యక్తులు అయితే వారిపై చట్టపరంగా పోలీస్ కేసులు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థలో విధులు నిర్వహించే కార్మికులకు ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుందని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3వ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా నేరుగా కమిషనర్ దృష్టికి తెచ్చే అవకాశం కల్పించామని తెలిపారు. కార్మికులు క్షేత్ర స్థాయిలో లేదా కార్యలయం నుండి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలా కాకుండా ఎటువంటి అనుమనుతులు, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అయ్యే కార్మికులను ఆప్కాస్ నుండి తొలగించి, కొత్త వారిని తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
