Breaking News

దిశ యాప్ ను ఎలా వినియోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించండి…


– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆదేశం
– గుడివాడ పట్టణంలో దిశ పోస్టర్ ఆవిష్కరణ

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతూ తీసుకువచ్చిన దిశ యాప్ ను ఎలా వాడాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శుక్రవారం గుడివాడ పట్టణంలోని అలంకృత ఫంక్షన్ హాల్ లో దిశ యాప్ పై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ ను డౌన్లోడ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. ముందుగా మహిళా పోలీసులకు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో దిశ యాప్ ను ఎలా ఉపయోగించాలన్న దానిపై మహిళలకు తెలియజేయాలన్నారు. అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక డ్రైవ్ గా తీసుకుని చేపట్టాలని ఆదేశించారు. కళాశాలలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులు వినియోగించడంపై అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల దిశ యాప్ వినియోగం మరింత పెరుగుతుందన్నారు. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు, స్థానిక పోలీస్ స్టేషన్లు సత్వరం స్పందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత లక్ష్యంగా దిశ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలకు పాల్పడే వారిపై త్వరితగతిన శిక్షలు పడేందుకు దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. దిశ చట్టం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని సూచించిందని తెలిపారు. మరలా దిశా చట్టంలో కొన్ని మార్పులు చేసి పార్లమెంటుకు పంపడం జరిగిందన్నారు. ఈ చట్టం కార్యరూపం దాల్చడంలో మహిళలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి తమ సలహా సూచనలు ఇచ్చి చట్టం వచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై కొంత ఒత్తిడి తీసుకురావాలన్నారు. సమాజంలో ఉన్న ప్రతి మహిళకు రక్షణ కల్పించడమే ద్యేయంగా పని చేస్తున్నామన్నారు. అందరికీ రక్షణ కల్పించలేక పోవచ్చు, కానీ ఈ దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న కొంతమందికి అయినా సహాయం చేసి రక్షించగలిగితే ఈ యాప్ ను ఏర్పాటు చేసిన దానికి సార్థకత చేకూరుతుందని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ గుడివాడ సబ్ డివిజన్లో ఇప్పటివరకు 1.25 లక్షల మంది, కృష్ణా జిల్లాలో ఆరు లక్షల మంది దిశా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. అనంతరం దిశ యాప్ పోస్టర్లను మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను మంత్రి కొడాలి నాని సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డిఓ జి శ్రీను కుమార్, డిఎస్పి ఎన్ సత్యానందం, ఐసిడిఎస్ సిడిపిఓ సముద్ర వేణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి, కాట్రగడ్డ రజని తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *