-వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సామాన్యులకు సైతం సరళంగా అర్థమయ్యే విధంగా తెలుగుభాషలోకి అనువదించి రాసిన కవయిత్రి మొల్ల : జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగుభాషలోకి అనువదించి రాసిన ఘనత కవయిత్రి మొల్ల వారిది అని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక తిరుపతి కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ నందు జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో శ్రీ మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిఆర్వో నరసింహులు హాజరై పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డిఆర్వో నరసింహులు మాట్లాడుతూ… కడప జిల్లా గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అన్నారు. ఆమె రచనా శైలి చాలా సరళమైనది మరియు రమణీయమైనదన్నారు. తాళ్లపాక అన్నమయ్య (అన్నమాచార్య) భార్య తాళ్లపాక తిమ్మక్క తర్వాత చెప్పుకోదగ్గ రెండవ తెలుగు కవయిత్రి మొల్ల అని కీర్తించారు. శ్రీరాముని చరితమును ఎందరో ఎన్నో విధములుగా రచించినప్పటికీ సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో మొల్ల రామాయణాన్ని సరళంగా 5 రోజుల్లోనే రాయడం ఆమె ప్రత్యేకత అన్నారు. శ్రీ కృష్ణదేవరాయల సమయంలో ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతిగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బి.సి సంక్షేమ శాఖ అధికారిణి జ్యోత్స్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, కలెక్టరేట్ ఎఓ భారతి, బిసి సంక్షేమ అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.