విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
అధికారులు సమిష్టి కృషితో అన్ని రంగాల్లోను జిల్లాను అగ్రగామిగా నిలపాలని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ), జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు.
నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయా శాఖల ప్రగతిని జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలు, కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల అమలు నూరుశాతం జరగాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల లబ్దిని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో అమలు తీరును పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవాలన్నారు. ప్రతి నెల ప్రణాళిక బద్దంగా ముందస్తు టూర్ ప్రోగ్రామును నిర్దేశించుకొని పర్యటిస్తే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ముఖ్యంగా వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలైన ఉద్యానవన, సెరీకల్చర్, ఫిషరీస్, రంగాలలో సమన్వయానికి అవకాశం ఉంటుందన్నారు. పధకాల లబ్దిని చేకూర్చడంలో నాణ్యతను దృష్టిలో పెట్టుకోవాలని, లబ్దిదారుల నుండి ఎటువంటి పిర్యాదులు రానీయకుండా ముందుగానే పరిశీలించుకోవాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం, ఇతర మార్గాల ద్వారా నమోదవుతున్న అర్జీలకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. గ్రీవెన్స్ కు సంబంధించి శాఖల వారీగా డాష్ బోర్డు ఉంటుందని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ పరిష్కరించిన ఎండార్స్ మెంట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. పరిష్కరించిన అర్జీలపై ఐవీఆర్ఎస్ ద్వారా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా నమోదయ్యే అర్జీల పరిష్కారంపై అలసత్వం వహించే అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, మైన్స్, తదితర శాఖలకు జిల్లా స్థాయిలోనే లక్ష్యాలను నిర్దేశించుకొని ఆదాయాన్ని సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెక్టార్ వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి వాటి ప్రగతిని పరిశీలించడం జరుగుతుందని జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను జిల్లాలో నూరుశాతం అమలుతో లబ్ది చేకూరుస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో జాబ్ మేళా నిర్వహణ, నైపుణ్యాన్ని పెంపొందించడం ఉద్యోగ కల్పన తదితర లక్ష్యాలను పూర్తిచేశామన్నారు. నాటుసారా నిర్మూలన , నకిలీ మద్యం నియంత్రణలో భాగంగా నవోదయం కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి లక్ష్యాన్ని చేరుకున్నామని, ఉపాధిహామీ పధకంలో ప్రతి కూలీకి పని కల్పిస్తున్నామన్నారు. మహిళాభివృద్ది శిశు సంక్షేమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇ-పంట, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పధక అమలు, పశుసంవర్ధక శాఖలో గోకులాలు, వాక్సినేషన్ తదితర లక్ష్యాలను పూర్తిచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మికి వివరించారు.
సమావేశంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో శ్రీలత, ఆర్డీవోలు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News