విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించిన ఈ – రూపీ (ప్రీపెయిడ్ ఇ-వోచర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ప్రముఖులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ డిజిటల్ పాలన, భవిష్యత్ సంస్కరణలకు ఈ – రూపీ ఒక ఉదాహరణ అన్నారు. ఈ – రూపీ ప్రారంభంతో దేశంలో డిజిటల్ లావాదేవీలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ యొక్క కొత్త శకంలోకి ప్రవేశించాయని, పారదర్శక సేవలను అందించటంలో మరింత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. తొలుత ఆరోగ్య రంగంలో ప్రయోజనాల బదిలీ కోసం ఈ – రూపీ వ్యవస్థ ఉపయోగ పడుతుందని రాబోయే రోజుల్లో ఇతర రంగాలకు విస్తరిస్తామని ప్రధాని పేర్కొన్నారు. నిధుల బదిలీ కోసం కూడా ఈ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఈ – రూపీ ప్రారంభంతో డిజిటల్ టెక్నాలజీని అవలంబించడంలో ఇతర దేశాల కంటే మనం వెనుకబడి లేమని ప్రపంచానికి చాటామని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు హాజరయ్యారు
Prajavartha Online Telugu News