ఏపరిశ్రమను మూసివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు…

-పరిశ్రమలు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిని సాధించాలన్నదే ప్రభుత్వ నిర్ణయం…
-మానవాళి మనుగడకు హాని జరగకుండా పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి…
-కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని 54 పరిశ్రమలను మూసివేయాలని, 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించాం…
-పనిగట్టుకుని అమర్ రాజా పరిశ్రమపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదనేది పూర్తిగా అవాస్తవం…
-రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఏపరిశ్రమను మూసివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, పర్యావరణానికి హాని జరగకుండా ఏపరిశ్రమ అయినా ఉత్పత్తి చేసుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. విజయవాడ బందరు రోడ్డులోని ప్లానింగ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్రంలో పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలను, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలను పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వివరించారు. పరిశ్రమలనుంచి వచ్చే కాలుష్యాన్ని పరిగణనలోనికి తీసుకుని పరిశ్రమలను 3 కేటగిరీలుగా విభజించి అందుకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జనవరి నెలలో 54 పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ చేసిందని, వాటిలో కొన్ని పరిశ్రమల్లో ఎక్కువుగా కాలుష్యం వస్తున్నట్లుగా తేలిందని ఆయన అన్నారు. చిత్తూరులోని అమర్ రాజా, కడపలోని సిమెంటు పరిశ్రమలు, విశాఖపట్నం, కాకినాడలోని ఫార్మా పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసిందని ఆయన అన్నారు. ఈ పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకునేందుకు
ప్రభుత్వం రెండు నెలలు సమయం ఇచ్చామని అయినా ఎటువంటి మార్పు లేదని దీంతో రెండోదఫాకూడా కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసిందని, స్వయంగా వచ్చి చెప్పుకునేందుకు పరిశ్రమలకు అవకాశం కల్పించామని ఆయన అన్నారు. రెండు దఫాలుగా తనిఖీ, వారినుండి వివరణ కోరిన అనంతరం కాలుష్యనియంత్రణ చేయకపోతే అందులో పనిచేసేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. గతంలో ఏలూరులో ఈ తరహా వైపరీత్యాలకు కారణాన్ని కూడా తెలుసుకోలేకపోయామని ఆయన అన్నారు.
ఈ ఏడాది పరిశ్రమల్లో కాలుష్యనియంత్రణ చర్యలు చేపట్టని 64 పరిశ్రమలకు ఉత్పత్తి నిలిపివేయాలని, మరో 54 పరిశ్రమలను మూసివేయాలని ఆదేశాలిచ్చామన్నారు. అయితే చిత్తూరు, తిరుపతిలలోని గల అమరాజాబ్యాటరీ సంస్థకు కాలుష్యనియంత్రణ నిబంధనలు ఉల్లంఘించినందులకు గాను పరిశ్రమ మూసివేయాలని ఆదేశాలిచ్చామన్నారు. పనిగట్టుకుని పరిశ్రమలను మూసివేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని వస్తున్న ప్రచారం సరికాదని పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
అమరాజాబ్యాటరీస్ పరిశ్రమపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులమేరకు సాంకేతిక కమిటీని నియమించామని ఆకమిటీ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టుకు అందించామని విజయకుమార్ అన్నారు. అమరరాజా బ్యాటరీస్ నుంచి సీసం కలిపిన నీటిని మొక్కలు పెంచేందుకు వినియోగిస్తున్నారని, దీనివలన స్థానిక జంతుజాలానికి మనుష్యులకు ప్రమాదకరమని ఆయన అన్నారు. పరిశ్రమల్లో కాలుష్య నివారణ ట్రీట్మెంట్ ప్లాంటులను ఏర్పాటు చేసుకొని కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టవలసి ఉండగా, అమర్ రాజా బ్యాటరీస్ నిబంధనలను యధేశ్చగా ఉల్లంఘిస్తూ రెండు పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యం కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని ఆయన అన్నారు. మొక్కలు, జంతువుల ద్వారా మనుష్యుల్లోకి సీసం చేరిపోతుందని, ఈ పరిశ్రమకు నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో కూడా సీసం కలుషితం అయ్యిందని సాంకేతిక కమిటీ నిర్ధారించిందని ఆయన అన్నారు. అలాగే గాలిలో కూడా 137 మరల ద్వారా సీసపు ధూళిని వదిలేస్తున్నారని ప్రతీచోటా రెండేసి నమూనాలను సేకరించి కాలుష్యనియంత్రణ మండలి ఒకచోట, హైదరాబాద్ లోని ఇపిటి ఆర్ ఐ వద్ద మరో నమూనా పరీక్ష చేయించామని పరిశ్రమ సమీపంలోని నీరు, గాలిలో కూడా సీసపు పాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆయన అన్నారు. పరిశ్రమ సమీపంలోని మల్లెమడుగు రిజర్వాయరులో 0.3 మైక్రోగ్రాముల సీసం ఉందని అంటే అనుమతించినదానికంటే 200 శాతం ఎక్కువ ఉందని, నాయుడు చెరువువద్ద 1100 శాతం ఎక్కువ ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఇటువంటి ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 6 నెలలకొకసారి రక్తనమూనాలు సేకరించవలసి ఉండగా, అమర్ రాజా బ్యాటరీస్ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆయన అన్నారు. ఉద్యోగులకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రక్తనమూనాలు సేకరించగా 500 మంది కంటే ఎక్కువమందికి రక్తంలో సీసం 42 మైక్రోగ్రామ్ డెసీలీటర్ ఉందని అన్నారు. అన్నీ అంశాల్లోనూ అమర్ రాజా బ్యాటరీస్ నిబంధనలను అతిక్రమించిందని, పూర్తి స్థాయిలో దీనిపై అధ్యయనం చేయాలని కోర్టు ఆదేశించిందని విజయ్ కుమార్ తెలిపారు. కోర్టు ఆదేశాలు మేరకు ఐఐటి మద్రాస్ ప్రతినిధులను అమర్ రాజా ఫ్యాక్టరీలో పరిశీలన కొరకు ప్రభుత్వం పంపించగా, ఫ్యాక్టరీ గేటు వద్ద అడ్డుకున్నారని, దీనితో ప్రభుత్వం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసుకూడా పెట్టామని ఆయన అన్నారు. పొరపాట్లను సవరించుకుని ఉత్పత్తి చేసుకోవాలని అమర్ రాజా ఫ్యాక్టరీకి సూచించినా అక్కడ పర్యావరణాన్ని మరమ్మత్తులు చేయలేని నష్టం జరిగిందని, జీవ వైవిధ్యం అంతా దెబ్బతిందని, గాలి, నీరు, భూమి దారుణంగా దెబ్బతిన్నాయని, జరిగిన తప్పులు సరిచేయాలని, వారిచేతే ఈ పనులు చేయించాలని ప్రభుత్వం తరపున కోర్టును కోరామన్నారు. ఇక ఈపరిశ్రమ ఇక్కడ కొనసాగేందుకు వీలు లేదని మరోచోటుకు తరలించాలని ఆదేశించాలని కోర్టును కోరామని విజయ్ కుమార్ అన్నారు. ఏపరిశ్రమ మూసివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, పర్యావరణానికి హానిలేకుండా పరిశ్రమలు నిర్వహించుకోవచ్చునని, అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమకు కూడా కాలుష్య నియంత్రణ ఉల్లంఘనలు సరిచేసుకోవాలని మాత్రమే సూచించామని ఆయన అన్నారు. వాతావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిని సాధించాలని ప్రభుత్వ లక్ష్యమని ఈదిశగా పరిశ్రమలు నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. పరిశ్రమలు, ఇతర రంగాలకు హాని జరిగినా, మానవ మనుగడకు హాని జరిగినా రక్షణ కల్పించేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటుందని, దీనిలో భాగంగానే అమరరాజా బ్యాటరీస్ పై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వం పనిగట్టుకుని కొన్ని పరిశ్రమలపై చర్యలు తీసుకుంటుందని ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశము పూర్తిగా అవాస్తవమని, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు మేరకే చర్యలు చేపట్టామని విజయ్ కుమార్ అన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *