-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
-హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి
-బీసీ హాస్టల్ వార్డెన్లతో మంత్రి సవిత
తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీల పెంపునకు కృషి చేస్తానని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలని స్పష్టంచేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను రాష్ట్ర బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘ ప్రతినిధులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంత్రిని వారు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైందని, ఇప్పటికే ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లు, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిందని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, తాజా ఆహారం, మరిగించి చల్లార్చిన నీరు మాత్రమే అందించాలని స్పష్టంచేశారు. విద్యార్థులకు జలుబు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, తక్షణమే అందుబాటులో ఉన్న వైద్యులతో వైద్య సేవలందించాలన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
హాస్టళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. డైట్ ఛార్జీల పెంపు విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. బీసీ హాస్టళ్లకు మాత్రమే కాకుండా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల హాస్టళ్లకు సంబంధించి డైట్ ఛార్జీలపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే డైట్ ఛార్జీల పెంపు విషయమై నిర్ణయం వెలువడే అవకాశముందన్నారు. నాలుగో తరగతి ఉద్యోగాలు, హెచ్ డబ్ల్యూవోల ఖాళీ పోస్టుల భర్తీ, ఏబీసీ డబ్ల్యూవోల పదోన్నతల అంశాలను కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులు కేటాయిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి సవితకు రాష్ట్ర బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘ ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన్, గౌరవ అధ్యక్షులు దయానంద్ రాజు, రాష్ట్ర అసోయేషిట్ ప్రెసిడెంట్ రాజోలు శ్రీను, సాగర్ బాబు సహా వివిధ జిల్లా అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News