రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ IVF డే (In-Vitro Fertilization Day) మరియు ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ డే (Embryologist Day) సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. కె. వెంటేశ్వరరావు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం లోని నోవా IVF సెంటర్ వద్ద Assisted Reproductive Technology (ART) Level–2 తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (GGH), రాజమండ్రి కి చెందిన నిపుణుల బృందం పాల్గొని కేంద్రంలోని వైద్య సదుపాయాలు, పరికరాలు, నిబంధనలు, మరియు సేవల ప్రమాణాలను సమీక్షించారు. కేంద్రం ART చట్టంకి అనుగుణంగా పని చేస్తున్నదా అన్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో వంధ్యత (infertility), పునరుత్పత్తి ఆరోగ్యం (reproductive health)పై చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా తీసుకున్నారు. సహజంగా గర్భం రాకపోతే వైద్యుల సహాయంతో గర్భధారణకు ఉపయోగించే IVF ప్రక్రియను గురించి ప్రజలకు తెలియ జేశారు. ఇందులో స్త్రీ శరీరం లోని అండాలను పురుషుడి శుక్రకణాలతో ప్రయోగ శాలలో కలిపి గర్భకల్పన చేసి, ఆ భ్రూణాన్ని స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టి గర్భధారణ ప్రారంభం అయ్యేలా చేస్తారు. ఇలాంటి చికిత్సలో ఎంబ్రియాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం అని అధికారులు పేర్కొన్నారు. వంధ్యత ఒక చికిత్సకు లోబడి పరిష్కరించదగిన ఆరోగ్య సమస్య అని, గుర్తింపు పొందిన ART కేంద్రాలనే సంప్రదించాలి అనే విషయాన్ని సూచించారు. ప్రతి దంపతికి తల్లిదండ్రులు కావడానికి హక్కు ఉందన్న సందేశంతో, జిల్లాలో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పద్ధతులపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, రాజమండ్రి వైద్య నిపుణులు డా. అక్క మాంబ (HOD, గైనకాలజీ), డా. వాసవి (అసిస్టెంట్ ప్రొఫెసర్ – చిన్నపిల్లల నిపుణులు), డా. పరంకుశ (అసిస్టెంట్ ప్రొఫెసర్ – పథాలజీ), డా. రామచంద్ర (రేడియాలజిస్ట్), డిప్యూటీ డిఎంహెచ్వో డా. పి. సరిత, డా. రాజీవ్ శామ్యూల్ (ప్రోగ్రాం ఆఫీసర్), డిప్యూటీ డెమో సత్యకుమార్, ఎన్.జి.ఓ నారిసాక్ష్యం తరఫున అర్జున్ (సోషల్ వర్కర్) తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News