మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం బ్యారేజీ లో వరద నీటి ప్రవాహం రాను రాను పెరుగుతున్న దృష్ట్యా అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి క్షేత్రాధికారులతో వరదలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటి వివాహం వచ్చే అవకాశం ఉందని, 2 అడుగుల మేరకు అన్ని గేట్లను ఎత్తివేసి వరద నీటిని క్రిందకు వదిలారని, ఆ నీరు పూర్తి ఒరవడితో దిగువన ఉన్న కృష్ణాజిల్లాలోకి వస్తోందన్నారు. క్షేత్రాధికారులందరూ వారి ప్రధాన కేంద్రాల్లో అందుబాటులో ఉండి వరదనీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సిబ్బందికి ఎవరికైనా సెలవులు ఇచ్చి ఉంటే వాటిని వెంటనే రద్దుచేసి విధులకు హాజరుకావాలని ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులు కాలువల వద్ద గట్టి నిఘా ఉంచి వరదనీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనించుకోవాలన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో దండోరా వేయించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.. ఇందుకోసం గ్రామ రెవెన్యూ అధికారులకు, గ్రామ సచివాలయ సిబ్బందికి వెంటనే వరద సమాచార సందేశాన్ని పంపించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో వెంటనే ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటుచేసి తగిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల్లోని గ్రామాలను సందర్శించి వరద పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. వరద ఉధృతి ఆకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున ఈతకు వెళ్లే వారిని వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు డిఎస్పి లతో సమన్వయం చేసుకొని వరద పరిస్థితులను గమనించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, ఆర్డీవోలు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, జలవనుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News