Breaking News

మానవ అక్రమ రవాణా పై అప్రమత్తంగా ఉండి గ్రామీణ ప్రజలను కూడా చైతన్యపరచాలని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
మానవ అక్రమ రవాణా పై అప్రమత్తంగా ఉండి గ్రామీణ ప్రజలను కూడా చైతన్యపరచాలని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం లోని కృష్ణా విశ్వవిద్యాలయం లో జరిగిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరమని, దీనిపై అందరూ అవగాహన పెంపొందించుకొని, ఈ దోపిడీని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏదైనా సంఘటన జరిగాక స్పందించడం కంటే ముందుగానే దాని గురించి తెలుసుకొని జాగ్రత్త పడితే చాలా మంచిదన్నారు. చదువు పూర్తి చేసుకొని కళాశాల నుండి బయటకు వచ్చాక తెలియని వారు మన చుట్టూ ఉంటూ ఎలా ఏం చేస్తారో తెలియదన్నారు. అమ్మాయిలు, మహిళలే కాదు యువకులు, వలస కూలీలు కూడా అక్రమ రవాణా బారిన పడుతున్నారన్నారు.. సమాజంలో కేవలం లైంగిక అవసరాలకే కాదు మానవ అవయవాలు కూడా అక్రమ రవాణా జరుగుతోందన్నారు ముఖ్యంగా గ్రామాలలో ఎక్కువగా ఇటువంటి మానవ అక్రమ రవాణా జరుగుతోందన్నారు. తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మాత్రమే ఉండడం, దుర్బల కుటుంబాలు అక్రమ రవాణాకు గురవుతుంటాయన్నారు స్మార్ట్ ఫోన్ చాటింగు సందేశాల ద్వారా సులభంగా డబ్బు సంపాదించే క్రమంలో ఉద్యోగాల వేటలో ఫోన్లు వస్తుంటాయని క్లిక్ చేస్తే వారి వలలో పడే అవకాశాలు ఉంటాయన్నారు.ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలకు రమ్మంటారు, ఒకసారి వాళ్ళ వారి ఊబిలో చిక్కుకుంటే తిరిగి బయటపడడం చాలా కష్టమన్నారు. ఆన్లైన్లో స్నేహాలు, ఫోటోలు, వీడియోలు పంచుకోవడం తోనే సమస్య మొదలవుతుందన్నారు. సాంకేతిక నైపుణ్యం బాగా తెలిసిన వారే ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసి నియంత్రించాలని చూసిన ప్రజల్లో సరైన అవగాహన లేకపోతే అక్రమ రవాణాను నియంత్రించడం చాలా కష్టమన్నారు. కొన్ని కుటుంబాలలో కొడుకు కూతురు మధ్య వివక్షత ఉండటంతో తల్లిదండ్రులతో గొడవపడి యువతులు బయటకు వచ్చి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేయాలన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళము, తూర్పు గోదావరి విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో కొంత మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఇందుకు ప్రధాన కారణం గంజాయి వాడకమని దాన్ని తీసుకుంటే ఆలోచన శక్తి కోల్పోతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చురుకుగా ఈగల్ బృందాలను ఏర్పాటు చేసి గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అక్రమ వినియోగాన్ని నియంత్రించేందుకు గట్టిగా చర్యలు తీసుకుంటూ ఉందన్నారు. తద్వారా నేరాల సంఖ్య అదుపులోకి వచ్చిందన్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణాపై అవగాహన రావాలన్నారు.
ఎక్కడైనా మత్తు పదార్థాలు, మానవ అక్రమ రవాణా జరుగుతుంటే ఆ సమాచారం వెంటనే పోలీసులకు ధైర్యంగా తెలియజేయడం చాలా ముఖ్యమన్నారు. ఆ విధంగా చేయడం వలన మరల అటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే వారికి ఎటువంటి శిక్ష ఉండదన్నారు. దానిని పోలీసులు రహస్యంగా కూడా ఉంచుతారన్నారు. పోలీసులు కూడా తమ వంతు బాధ్యతగా మెరుగైన జవాబుదారీతనంతో విధులు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అక్రమ రవాణా బాధితులకు రక్షణ, నష్టపరిహారం, పునరావాసంతో పాటు తగిన న్యాయం అందించాలని పోలీసులకు సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడే ట్రాఫికర్లకు చట్టపరంగా కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలలో మానవ అక్రమ రవాణా జరగకుండా కొన్ని యూనిట్లు పనిచేస్తున్నాయని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్ నడుస్తోందని అక్కడ మహిళలకు ఆశ్రయము గాని కౌన్సిలింగ్ గాని వైద్య పరంగా గాని న్యాయపరంగా గాని ఎలాంటి అవసరమైన సహాయం చేసేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉంటారన్నారు. ఏమైనా అవసరమైతే మహిళా హెల్ప్ లైన్ నంబర్లు 181, 112 సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ వి నాయుడు, విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కే రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఉష ,రెక్టారు బసవేశ్వర రావు, విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు రావూరి సూయజ్ పాల్గొని మానవ అక్రమ రవాణా పై అవగాహన కల్పించారు. తొలుత మానవ అక్రమ రవాణా పై అవగాహన పెంపొందించే గోడపత్రాన్ని మహిళా చైర్పర్సన్ ఆవిష్కరించారు. తదనంతరం చైర్పర్సన్ ను కృష్ణ విశ్వవిద్యాలయం ఉపకులపతి, రిజిస్ట్రార్, రెక్టారు అందరూ కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు, ఐసిడిఎస్ అధికారులు, విశ్వ విద్యాలయం అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *