మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 15న నిర్వహించబోయే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యక్రమానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు నిర్వర్తించవలసిన విధులను వారికి వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా పోలీసు కవాతు మైదానంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. పోలీసు గౌరవ వందనం, కవాతు, బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు, ప్రజా ప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు, ఆహ్వానం, అదేవిధంగా స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి వివరాలను సిద్ధం చేయాలన్నారు. ఉద్యోగుల సేవలను గుర్తిస్తూ కార్యక్రమం రోజున వారికి అందించే ప్రశంస పత్రాల విషయంలో గందరగోళాన్ని నిరోధించేందుకు ముందుగానే వారు సిద్ధంగా ఉండేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా సంక్షేమ అభివృద్ధిని ప్రతిబింబించేలా, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఉండాలన్నారు. అదేవిధంగా జిల్లా సాధించిన ప్రగతిని వివరించేలా కూడా స్టాల్ ను ఏర్పాటు చేయాలని సిపిఓ కు సూచించారు. దేశభక్తిని చాటే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అదేవిధంగా ఈ సారి విద్యార్థులను కవాతులో భాగస్వామ్యం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కార్యక్రమానికి ఎలాంటి అవరోధం కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని, కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్నాక్స్, తాగునీరు అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమన్వయం చేసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
సమావేశంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, బందరు ఆర్డిఓ కే స్వాతి, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, మెప్మా, డ్వామా, ఐసిడిఎస్, డి ఆర్ డి ఏ పీడీలు సాయిబాబు, ఎన్ వి శివప్రసాద్, ఎం ఎన్ రాణి, హరిహరనాథ్, అగ్నిమాపక శాఖ అధికారి ఏసురత్నం, డీఈవో రామారావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి షేక్ షాహిద్ బాబు, సిపిఓ ఎస్ భీమరాజు, మత్స్య, పశుసంవర్ధక శాఖల అధికారులు నాగరాజ, చిన్న నరసింహులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News