-ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకం ఎగురవేయాలి
-జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి
-హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా మెగా ర్యాలీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ సమైక్యతను చాటిచెప్పేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి తెలిపారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆర్ఎంసి అధికారులు, ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులతో మెగా ర్యాలీ నిర్వహించారు. తొలుత ప్రచార పోస్టర్ ను కలెక్టర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం మహిళలు, యువతతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టగా, పెద్ద సంఖ్యలో నగర ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని కలెక్టర్ అన్నారు. జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని.. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నగర పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పతాకం ఔన్నత్యాన్ని, ప్రాధాన్యాన్ని చాటిచెప్పేందుకు, ప్రతిఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో దేశభక్తిని పెంపొందించడానికి హర్ ఘర్ తిరంగా, ఆజాది కా అమృతోత్సవం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే హర్ ఘర్ తిరంగా సెల్ఫీ బూత్ లను ఏర్పాటు చేయడం.. అధికారులు, ప్రజలు ఫోటోలను వెబ్సైటు నందు అప్లోడ్ చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ, సెక్రటరీ జి.శైలజవల్లి, డిప్యూటీ డైరక్టర్ రామారావు, సిటీ ప్లానర్ జి.కోటయ్య, ఎస్ఈ(ఇంజనీరింగ్) ఎం.సీహెచ్.కోటేశ్వరరావు, ఎంహెచ్ఓ వినూత్న, రెవిన్యూ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావు, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, సీఎంఎం రామలక్ష్మి, ఈఈలు మాధవి, మదర్సా అలీ, ఏడీహెచ్ స్వాతి, అన్ని విభాగాల హెచ్ఓడీలు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News