Breaking News

శేషాచల అరుదైన జంతు జాతుల పరిరక్షణపై పార్లమెంటులో ప్రస్తావన

-అటవీ భూముల ఆక్రమణలపై ఎంపీ గురుమూర్తి ఆందోళన

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
శేషాచల జీవవైవిధ్య అభయారణ్యంలో అంతరించిపోతున్న మూషిక జింక, బంగారు బల్లి, దేవాంగ పిల్లి, రంగుల ఉడుత, పసుపు గొంతు పిగిలి పిట్ట వంటి అరుదైన జంతు జాతుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో అడిగారు. అలాగే ఈ జంతువుల సంఖ్య పెరిగేందుకు చేపడుతున్న పరిశోధనలు, పర్యవేక్షణ కార్యక్రమాలు, అభయారణ్య అభివృద్ధిపై వివరాలు కోరారు. వన్యప్రాణుల రక్షణ, వేటగాళ్ల నిరోధం, ప్రజల భాగస్వామ్యం వంటి చర్యల కోసం నిధులు కేటాయించారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందించిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. శేషాచల అభయారణ్యంలో పరిరక్షణ చర్యలకు రాష్ట్రాలకు ‘వన్యప్రాణుల నివాసాల అభివృద్ధి’ పథకం కింద ఆర్థిక సహాయం అందుతున్నదని తెలిపారు. భారత జంతు శాస్త్ర పరిశోధనా సంస్థ జంతు వైవిధ్యంపై అధ్యయనం చేస్తుండగా, ఐజర్ పక్షుల శబ్దాల ఆధారంగా జీవ ధ్వని శాస్త్ర సాంకేతికత ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నదని చెప్పారు. అటవీ భూముల వినియోగం కారణంగా కలిగే నష్టాన్ని తగ్గించేందుకు కాంపా చట్టం కింద నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ. 121.63 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథారిటీకి మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు.

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ… శ్రీకాళహస్తి మండలం సింహాచల ఖండ్రిగలో 125 ఎకరాల రక్షిత అటవీ భూమిని టిడిపి ప్రజాప్రతినిధి కొల్లగొట్టే ప్రయత్నాలపై ఎంపి గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బారీ ఎత్తున అటవీ భూమిని సొంతం చేసుకునే ప్రయత్నాలని సంబంధిత అధికారులు అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. అటవీ భూములు రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంటే మరోపక్క టిడిపి నాయకులూ కోట్లాది రూపాయల భూములని కొల్లగొట్టడం దుర్మార్గమన్నారు. రక్షిత అటవీ భూములను కాపాడడం సంబంధిత అధికారుల బాధ్యత అని ఆయన గుర్తు చేసారు. అలా చర్యలు తీసుకొని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టవలసి వస్తుందని, అవసరమైతే కేంద్ర అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *