Breaking News

వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై పూర్తి అప్ర‌మ‌త్తంగా ఉన్నాం

– ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు
– క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది సూచ‌న‌ల‌ను పాటించండి
– క‌చ్చిత స‌మాచారానికి క‌మాండ్ కంట్రోల్ కేంద్రానికి కాల్ చేయొచ్చు
– 91549 70454 కంట్రోల్ రూమ్‌లో 24X7 స‌మ‌న్వ‌య శాఖ‌ల సిబ్బంది
– కృష్ణాన‌ది, బుడ‌మేరు, మున్నేరులో ప్ర‌వాహాన్ని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నాం
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై పూర్తి అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌ని.. కృష్ణాన‌దితో పాటు బుడ‌మేరు, మున్నేరులో ప్ర‌వాహాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని, ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. క‌లెక్ట‌రేట్‌లోని క‌మాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) నుంచి జిల్లాలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప‌రిస్థితిని స‌మీక్షించారు. రెవెన్యూ, ఇరిగేష‌న్‌, వైద్య ఆరోగ్యం, పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్‌, అగ్నిమాప‌క, విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులతో చ‌ర్చించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స‌చివాల‌యం యూనిట్‌గా 24X7 ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ బృందాలు, వరద స్పందన బృందాలు క్రియాశీలంగా ఉన్నాయ‌న్నారు. కృష్ణా వ‌ర‌ద నీటికి సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని ప‌రీవాహ‌క గ్రామాల ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. దాదాపు 95 గ్రామాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. బ్యారేజీకి ఎగువ‌, దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందిస్తున్నామ‌న్నారు. ఎగువున కురిసిన వ‌ర్షాల‌తో కృష్ణాన‌దిలో వ‌ర‌ద ప్ర‌వాహం పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్లొద్ద‌న్నారు. ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం చిన‌లంక‌, పెద‌లంక‌కు చెందిన కుటుంబాలు సుర‌క్షితంగా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. అదేవిధంగా బుడ‌మేరు, మున్నేరులో ప్ర‌వాహాల‌ను కూడా నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని.. వెల‌గ‌లేరు రెగ్యులేట‌ర్ వ‌ద్ద ప్ర‌త్యేక బృందాలు ఉన్నాయ‌న్నారు. ప్ర‌స్తుతానికి ఈ వాగుల్లో ప్ర‌వాహాలు సాధార‌ణంగానే ఉన్నందున ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో వ‌ర్షాలు కురిసే స‌మ‌యంలో డ్రెయిన్ల నుండి వర్షపు నీటిని బయటకు పంపడానికి.. నీటిపారుదల శాఖతో సమన్వయంతో ఏలూరు, రైవాస్ ప్రధాన కాలువల నీటి మట్టాన్ని తగ్గించడం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. కొండ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను న‌గ‌ర‌పాల‌క సంస్థ సిబ్బంది స‌హాయంతో అప్ర‌మ‌త్తం చేశామ‌ని.. వ‌ర్షాలు ప‌డే స‌మ‌యంలో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డే ప్ర‌మాద‌మున్నందున‌.. పున‌రావాస కేంద్రాల‌కు రావాల‌ని, దాదాపు 32 పున‌రావాస కేంద్రాల్లో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించిన‌ట్లు వివ‌రించారు. ముందు జాగ్ర‌త్త‌గా తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో ప్ర‌జ‌లు.. అధికారులు, సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని, హెచ్చ‌రిక‌ల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

91549 70454తో క‌మాండ్ కంట్రోల్ కేంద్రం:
వ‌ర్షాలు వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో 91549 70454 నంబ‌రుతో కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామ‌ని.. ఇందులో స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, సిబ్బంది విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఎంత వ‌ర్ష‌పాతం న‌మోదైంది? వాగుల్లో ప్ర‌వాహ ప‌రిస్థితి ఎలా ఉంది? ఇలా వివిధ అంశాల‌ను నిరంత‌రం సేక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. రియ‌ల్ టైమ్ స‌మాచారం అందుబాటులో ఉన్నందున ప్ర‌జ‌లు స‌మాచారం కోస‌మైనా, స‌హాయానికైనా క‌మాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేయొచ్చ‌ని సూచించారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అయితే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *