గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం లభిస్తుందని, ఇళ్ల నుండి, వ్యాపార వాణిజ్య సంస్థల వారు వ్యర్దాలను రోడ్లు లేదా డ్రైన్లలో వేయవద్దని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. శనివారం జేకేసి రోడ్, అరండల్ పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను తనిఖీ చేసి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడాన్ని వ్యక్తిగత భాధ్యతగా భావించాలని, పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యకర జీవితానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. వ్యర్దాలను కాల్వల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేయవద్దని, వీటి వలన మురుగుపారుదలకు అడ్డంకి ఏర్పడడం జరిగి దుర్వాసన, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందన్నారు. వ్యర్ధాలను తప్పనిసరిగా ఇంటి వద్దకే వచ్చే ప్రజారోగ్య కార్మికులకే అందించాలని, ఎక్కడైనా కార్మికులు రాకుంటే జిఎంసి కాల్ సెంటర్ కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రోడ్ల మీద, డ్రైన్లలో వ్యర్దాలు వేసే వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్లు, డ్రైన్లు వంటి నిర్మాణ అనంతరం నిర్మాణ వ్యర్దాలను సదరు కాంట్రాక్టరే తొలగించాలని, లేకుంటే ఎమినిటి కార్యదర్శి లేదా ఏఈ భాధ్యత వహించాలన్నారు. పర్యటనలో డిఈఈలు రమేష్ బాబు, శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News