తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా, స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్, తిరుపతి లో నిర్వహిస్తున్న ‘’మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు”రెండవ మరియు చివరి రోజులో భాగంగా సదస్సుకు చేరుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన డెలిగేట్లు.
సోమవారం ఉదయం తిరుపతిలోని స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన’మహిళా సాధికారత సదస్సుకు హాజరైన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా , రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కి స్వాగతం పలికిన పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు డి. పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ ఎమ్. జకియా కానం, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర మహిళా సంక్షేమకమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర,తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
రెండవ రోజు నిర్వహించిన జాతీయ మహిళా సాదికారత సదస్సును జాతీయ గీతం మరియు రాష్ట్ర గీతాలాపనలతో సభ ప్రారంభమైంది. అనంతరం వేదికపై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కు శాలువా కప్పి శ్రీరామ పట్టాభిషేకం చిత్ర పటాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ కు శాలువా కప్పి శ్రీ వారి చిత్ర పటాన్ని శాసన సభ సభాపతి, ఉప సభాపతు లు బహుకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా సంక్షేమకమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ఆల్ ఇండియా ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సదస్సు పవిత్రమైన తిరుపతి నగరంలో ముగుస్తున్న సమయంలో మనమందరం ముఖ్యమైన మార్గదర్శకత్వం సాధించామని గర్వంగా చెప్పగలమన్నారు. ఈ సదస్సు ద్వారా మనం ముఖ్యంగా తెలుసుకున్నది ఏమనగా మహిళా సాధికారత లేకుండా వికసిత భారత్ సాధ్యం కాదు అలాగే మహిళా ప్రగతి చేయకుండా వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అసాధ్యమని తెలుసుకున్నామన్నారు.
ఈ రెండు రోజుల్లో మహిళా సాధికారతకు గొప్ప ఆలోచనలు అభిప్రాయాలు వినే అదృష్టం మనకందరికీ లభించిందని, భారతదేశంలో మహిళా సాధికారతను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఈ సమీక్షా సమావేశం ద్వారా స్పష్టమైన మార్గాలను కూడా గుర్తించడం జరిగిందన్నారు. ఈ సదస్సులో జెండర్ బడ్జెటింగ్ విషయంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా మహిళా సాధికారతకు ప్రతిభావంతంగా తీసుకెళ్లడానికి మన అభిప్రాయాలను పంచుకోవడం జరిగిందన్నారు. విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల క్రిందనే ముందు చూపుతో మహిళా సాధికారత కోసం ద్రాక్షారామ ఉద్యమం ద్వారా కోటిమంది గ్రామీణ పట్టణ నిరుపేద మహిళలను సంఘటితం చేయడం జరిగిందన్నారు.దీనికి ఉదాహరణలే నా నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య సాధించిన ప్రగతి మరియు విజయాలే నిదర్శనం అన్నారు. ఓర్వకల్లు ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం అని, అంతేకాకుండా అత్యధికంగా మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్న ప్రాంతం కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, అదే సమయంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పడి వారి ఎంతో ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. వారు సాధించిన విజయాలకు యుఎన్డీపీ ద్వారా అవార్డు కూడా లభించిందన్నారు. ఆ అవార్డు లభించిన స్ఫూర్తితో మరింతగా వారు భాద్యతాయుతంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సహాయం లేకుండా మంచి స్కూల్ ను ఏర్పాటు చేసుకొని మహిళా సంఘం ఆధ్వర్యంలోనే బాలబాలికల స్కూల్ నిర్వహించుచున్నారన్నారు.ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇచ్చి చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని కూడా తెలియజేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నానన్నారు.
మరొక కీలక అంశం మనం చర్చించినది… మన భారతదేశము డిజిటలైజేషన్ వైపు వేగంగా ముందుకు వెళుతున్నదని, కానీ లక్షలాది మహిళలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్నవారు ఇంకా మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ లకు డిజిటల్ విద్యకు దూరంగా ఉన్నారన్నారు. కావున ఈ డిజిటల్ విద్యా యుగంలో మహిళలకు సాంకేతిక విజ్ఞానం అవసరమని, సాంకేతిక అవగాహన కలిగి ఉంటె మహిళలు ఎంతో శక్తివంతమైన ఆయుధమై మహిళా సాధికారతకు అవకాశం ఇవ్వగలదని అన్నారు. ఆ దిశగా యువ నేత ఐటి సాంకేతిక మార్గదర్శి నారా లోకేష్ గారి స్వారథ్యంలో మహిళలకు సాంకేతిక విజ్ఞానం అందించడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మహిళా సాధికారత కోసం మనకు శాసనసభ మరియు పార్లమెంటరీ కమిటీల సభ్యులుగా ఈ సభా సిఫార్సులను వాస్తవ రూపంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
భారతదేశంలో ప్రతి మహిళ గౌరవంగా స్వేచ్ఛగా ధైర్యంగా జీవించే అవకాశాన్ని పొందాలని, ఇదే ఈ సదస్సు యొక్క లక్ష్యం కావాలన్నారు. ఈ గొప్ప సదస్సును అనుగ్రహ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి నగరంలో నిర్వహించడానికి కారకులైన గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి, హరివంశ్ నారాయణ్ సింగ్ కి, అయ్యన్న పాత్రుడు కి, రఘురామ కృష్ణం రాజు కి, పురంధేశ్వరి కి అలాగే ఈ సదస్సును విజయవంతం కావడానికి నిర్విరామంగా కృషి చేసి అన్ని సదుపాయాలు కల్పించిన అధికారులకు అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు.
Prajavartha Online Telugu News