రాజంద్రంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
బాల్యవివాహాల నివారణ, మాదకద్రవ్యాల ప్రభావం, న్యాయపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పంచాయితీ కార్యాలయం, ధవళేశ్వరం నందు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, బాల్య వివాహాలు సమాజానికి కలిగే హానులు, చట్టపరమైన శిక్షల గురించి వివరించారు. అలాగే మాదకద్రవ్యాల వాడకం, కలిగిఉండటం, సరఫరా, తయారీ, కొనుగోలు, విక్రయం అన్నీ క్రిమినల్ నేరాలు అన్నారు. ఇటువంటి వాటిలో పట్టుబడితే భవిష్యత్తు దెబ్బతింటుందని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల బారిన పడిన వారు స్వచ్ఛందంగా సహాయం కోరితే వారిపై ఎటువంటి నేర విచారణ ఉండదన్నారు. వారికి ఉచిత వైద్య సహాయం అందించ బడుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ “నల్సా మాదకద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదకద్రవ్యాల నిషేధం, 2025” పథకం కింద అందిస్తున్న సేవలు, అలాగే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ స్త్రీ సంక్షేమ అధికారి టి. శ్రీదేవి, సూపర్వైజర్ లు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్, పారా లీగల్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News