-జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాల పై ప్రజలకు అవగాహన కల్పించండి
-ప్రజలకు జరిగే మేలును సులభంగా అర్థమయ్యేలా వివరించాలి
-నెల రోజులపాటు సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ పేరిట ప్రచార కార్యక్రమాలు
-వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు దిశా నిర్దేశం చేసిన జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జీఎస్టీ సంస్కరణల మూలంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేకూరే మేలును వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ , జిల్లా జీ ఎస్ టి నోడల్ అధికారి వై. మేఘ స్వరూప్ తెలిపారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గ, మండల, మునిసిపల్, పంచాయతీ స్థాయి అధికారులకు జీఎస్టీ సంస్కరణల మూలంగా ప్రజలకు చేకూరనున్న మేలును గురించి సమగ్ర అవగాహన ప్రచారాలు ఎలా నిర్వహించాలో దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జేసీ మేఘ స్వరూప్ మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణల మూలంగా ప్రజలకు జరిగే మేలును సులభంగా అర్థమయ్యేలా క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. ఇందుకోసం నెల రోజుల పాటు సూపర్ జిఎస్టి -సూపర్ సేవింగ్స్ పేరిట ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి నియోజకవర్గం, మండలం, మునిసిపాలిటీ, గ్రామం/వార్డు స్థాయిలో ఒక నోడల్ అధికారిని జీఎస్టీ ఛాంపియన్ గా నియమించాలన్నారు. ఈ ఛాంపియన్లు సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ప్రచారాల సమన్వయం, సిబ్బంది శిక్షణ మరియు క్షేత్రస్థాయి కార్యాచరణల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారని వివరించారు. గతంలో జీఎస్టీ ఐదు పన్ను స్లాబ్ లుగా ఉండగా, ప్రస్తుతం రెండు స్లాబ్లు (5% మరియు 18%)గా కుదించబడ్డా యన్నారు. లగ్జరీ వస్తువుల మీద మాత్రమే 40 శాతం పన్ను ఉంటుందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల నిత్యావసర వస్తువులపై 0% లేదా 5% పన్నే విధించారన్నారు. దీని వలన వినియోగదారులపై పన్ను భారం తగ్గుతుందని, ఆదా అయ్యే డబ్బును ఇతర అవసరాల కోసం వినియోగించే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే, రాష్ట్రానికి తక్షణంగా సుమారు ₹8,000 కోట్లు వరకు రెవెన్యూ తగ్గినా, దీర్ఘకాలంలో వినియోగం పెరగడం వల్ల రెవెన్యూ తిరిగి పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో దసరా నుంచి దీపావళి వరకూ (నాలుగు వారాలపాటు) జీఎస్టీ సంస్కరణల మూలంగా కలిగే మేలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మొదటి వారంలో సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంపీడీవోలు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ లాగిన్ ద్వారా జిల్లా, మండల, మునిసిపల్, నియోజకవర్గ అధికారులను జీఎస్టీ ఛాంపియన్లుగా నియమిస్తారు. తరువాత మండల అధికారులు వారి పరిధిలోని సచివాలయ సిబ్బందిని జీఎస్టీ ఛాంపియన్లుగా నమోదు చేయాలని తెలిపారు. ప్రచార కార్యక్రమాల వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన యాప్‌లో షెడ్యూల్ చేయాలని, ఆ ప్రకారం ఫోటోలు, వీడియోలు, రిపోర్టులు అప్‌లోడ్ చేయాలని సూచించారు. దీనిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి శాఖలో జీఎస్టీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ సెలవులు మినహాయించి మిగిలిన రోజుల్లో ఈ అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ప్రత్యేక కార్యక్రమాల షెడ్యూల్:
సెప్టెంబర్ 25–29: “ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు” ప్రచారం – గృహ, నిత్యావసరాలు, ఆహారం, మందులు, విద్య, స్టేషనరీ, బట్టలు, క్రీడా సామాగ్రి, మహిళలు, పిల్లలు, రవాణాకు సంబంధించిన ప్రయోజనాలపై అవగాహన. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 6 వరకు పొడిగించారు.. సెప్టెంబర్ 30–అక్టోబర్ 6: వ్యవసాయం & వృత్తులపై ప్రచారం – రైతులు, కూలీలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, MSMEs, నేత, హస్తకళలు, పేపరు & ప్యాకేజింగ్, సెలూన్లు, స్పా, జిమ్, యోగా కేంద్రాలపై అవగాహన. ట్రాక్టర్ ర్యాలీలు, మేళాలు, ఎగ్జిబిషన్లు.
అక్టోబర్ 7–13: మానవ వనరులు & డిజిటల్ టెక్నాలజీ – విద్య, జీవన/ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్స్, ఇ-కామర్స్, గిగ్ ఎకానమీ. విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు. తయారీదారుల ఎగ్జిబిషన్లు, ద్విచక్రవాహన ర్యాలీలు, సెమినార్లు.
అక్టోబర్ 14: వికాస్ విశ్వాస్ – బిల్డింగ్, డెవలపర్స్, కనస్ట్రక్షన్ మెటీరియల్స్, టూరిజం & హాస్పిటాలిటీపై ఎగ్జిబిషన్లు, టూరిస్ట్ ఏజెంట్లు, హోటళ్లచే సాండ్ ఆర్ట్, ఫ్లాష్ మాబ్స్.
అక్టోబర్ 15: ట్రాన్స్‌పోర్ట్ & లాజిస్టిక్స్ – చిన్న వాహనాల ర్యాలీలు.
అక్టోబర్ 16: స్పోర్ట్స్ గూడ్స్, రిన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలపై అవగాహన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు.
అక్టోబర్ 19: దీపావళికి ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముగింపు కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ టి. సీతారామమూర్తి, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్, పిడి డిఆర్డిఏ ఎన్ వి వి ఎస్ మూర్తి, డిఎంహెచ్వో కె.వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు, నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News