రాజమహేంద్రవరం, , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో, పై ప్రాంతాల నుంచి గోదావరి నదిలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రం గాని ఉదయం గాని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని కూడా వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆమె సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, ఆల్కాట్ గార్డెన్స్, గౌతమీ ఘాట్ మరియు లోతట్టు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆల్కాట్ గార్డెన్ వద్ద 6 కుటుంబాలు, గౌతమీ ఘాట్ వద్ద 15 కుటుంబాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు. వరద ముప్పు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ఆర్.కృష్ణ నాయక్, ఇరిగేషన్ ఎస్.ఈ. కె.గోపినాథ్, అర్బన్ తహసీల్దార్ పాపారావు, ఇరిగేషన్ డి.ఈ. ఆనంద్ బాబు, తదితర అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News