-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
-కిరణ్య హోం స్టేతో ముందుకొచ్చిన వీరలంకపల్లి వాసి చింతా కిరణ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటకులకు స్థానిక జీవనశైలిని దగ్గరగా అనుభవించే అవకాశం కల్పించడం, గ్రామీణ పర్యాటకానికి ఊతమివ్వడం హోమ్ స్టే ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానాన్ని, పర్యాటక హోమ్‌స్టే పోర్టల్‌ను ఆవిష్కరించి, వర్చువల్గా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొమ్మూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో గోకవరం మండలం వీరలంకపల్లి గ్రామానికి చెందిన చింతా కిరణ్ కిరణ్యా హోమ్‌స్టే ను నిర్వహించడానికి ముందుకు వచ్చారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. హోమ్‌స్టే ప్రధాన ఉద్దేశ్యం పర్యాటకులకు స్థానిక జీవనశైలిని దగ్గరగా అనుభవించే అవకాశం కల్పించడం, గ్రామీణ పర్యాటకానికి ఊతమివ్వడం, అలాగే స్థానిక కుటుంబాలకు అదనపు ఆదాయాన్ని అందించడం అని అన్నారు. జిల్లాలో హోమ్‌స్టే విధానం విస్తరించడంతో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక వ్యవస్థకు చైతన్యం కలుగుతుందని పేర్కొన్నారు. డి.ఆర్.డి.ఏ. ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఆసక్తి కలిగిన స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి హోమ్‌స్టే రంగంలో ప్రోత్సహిస్తామని కలెక్టర్ తెలిపారు. పర్యాటకులు వచ్చినప్పుడు స్థానిక వంటలు, హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున లాభం కలుగుతుందని అన్నారు. హోమ్‌స్టేలు అభివృద్ధి చెందితే గ్రామాలే పర్యాటక కేంద్రాలుగా మారి, జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
కిరణ్యా హోమ్‌స్టే ప్రత్యేకతలు:
వీరలంకపల్లి గ్రామం, గోకవరం మండలంలో ఉన్న కిరణ్యా హోమ్‌స్టే రాజమహేంద్రవరం నుండి 22 కి.మీ., విమానాశ్రయం నుండి 16 కి.మీ., మారేడుమిల్లి – అడ్డతీగల నుండి 42 కి.మీ. దూరంలో ఉంది. హైవేకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉండటం వల్ల సులభంగా చేరుకోవచ్చు. పచ్చని ప్రకృతి వాతావరణంలో ప్రశాంతతను అందించే ఈ హోమ్‌స్టే వద్ద కొండలపై ట్రెక్కింగ్, చెరువు పక్కన విశ్రాంతి, సమీపంలోని త్రిమూర్తుల దేవాలయం, తంటి కొండ, కోరుకొండ, అచ్యుతాపురం వంటి తీర్థయాత్రా స్థలాలను దర్శించే అవకాశం ఉంది. ఈ హోమ్‌స్టేలో రెండు బెడ్‌రూమ్లు, సర్వెంట్ క్వార్టర్, ఆఫీస్ రూమ్ సౌకర్యాలు ఉన్నాయి. అతిథుల కోసం చిన్న సేంద్రీయ సాగు, నీటి కుంట పక్కన కూర్చునే ప్రదేశం ఏర్పాటు చేశారు. పురాతన వుడ్‌వర్క్‌తో “బ్యాక్ టు బేసిక్స్” కాన్సెప్ట్‌లో నిర్మించబడిన ఈ హోమ్‌స్టేలో భవిష్యత్తులో మట్టి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నామని కిరణ్య హోమ్ స్టే యజమాని చింతా కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, డి.ఆర్.ఓ. టి. సీతారామమూర్తి, పర్యాటక ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్, జిల్లా పర్యాటక అధికారి వెంకటాచలం, కిరణ్య హోమ్‌స్టే యజమాని చింతా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News