మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోని అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కే ఆర్ ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే స్వాతితో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా శాఖల అధికారులకు చేరిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ పోలీస్ శాఖకు సంబంధించి పరిష్కరించాల్సిన అర్జీలు అత్యధికంగా ఉన్నాయని, దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా జిఎస్టి సంస్కరణలతో తగ్గిన ధరలపై ప్రతి శాఖకు సంబంధించిన అంశాలపై డోర్ టు డోర్, ర్యాలీలు వంటి అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించి చేసిన కార్యకలాపాల వివరాలను నిర్దేశించిన ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.
అర్జీలలో కొన్ని:
పెడన మండలం, కాకర్లమూడి గ్రామంలోని కొంతమంది వ్యక్తులు గ్రామంలోని అంతర్గత రహదారిని ఇరువైపులా కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తమ ఇళ్లకు చేరుకునేందుకు రహదారి లేకుండా చేశారని, వారిపై తగిన చర్యలు తీసుకొని రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆ గ్రామ కాపురస్తుడు తుమ్మ శ్రీనివాసరావు అర్జీ సమర్పించారు.
కట్టుకున్న భర్త తనను, తన కుమార్తెను పట్టించుకోకుండా వేరే మహిళతో సహజీవనం చేస్తూ తమను ఇంటి నుంచి తరిమేశారని, తిరిగి తన భర్తతో కలిసి ఉండే విధంగా న్యాయం చేయాలని కోరుతూ కోడూరు మండలం, ఉల్లిపాలెం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ మాధవి కోరారు.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటీవల 2025 జనవరిలో పదవీ విరమణ పొందానని, అయితే పింఛను పొందుతున్న తాను, నామినీగా ఉన్న తన భార్యకు సంబంధించి పుట్టిన తేదీలలో తప్పులు ఉండటం చేత దానిని రికార్డులలో సరి చేసేందుకు గాను తన భార్యకు జనన ధ్రువీకరణ పత్రము మంజూరు చేయాలని మచిలీపట్నంనకు చెందిన రామన లక్ష్మణరావు అర్జీ ద్వారా విన్నవించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News