మోపిదేవి/చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా నదికి పెరుగుతున్న వరద ప్రవాహం పట్ల అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని కృష్ణానది పరీవాహక గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వరద ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు. తొలిత ఆయన పులిగడ్డ అక్విడెక్ట్ వద్దకు చేరుకుని వరద ప్రవాహాన్ని పరిశీలించారు. మండలంలోని బొబ్బర్లంక, కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామాలలో పర్యటించి ఇళ్ల వద్దకు చేరిన వరద నీటిని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. వరద తీవ్రత పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని ఆయన ప్రజలను కోరారు. ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయితీ, పోలీసు అధికారులతో మాట్లాడి నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిధిలోని కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 101 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, డయాలసిస్ రోగులు అదేవిధంగా పశువులను సైతం సురక్షిత ప్రాంతాలకు తరలించమన్నారు. తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాలలో ముందస్తు చర్యలుగా 22 బోట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం 6.84 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తోందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రస్తుతం పెనమలూరు, మోపిదేవిలో రెండు చొప్పున, అదేవిధంగా నాగాయలంకలో మూడు మొత్తం 7 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
నడకుదురు గ్రామంలో వరద ప్రవాహం పరిశీలన..
చల్లపల్లి మండలం, నడకుదురు గ్రామంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పర్యటించి కృష్ణానది వరద ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు. ఆయన గ్రామస్తులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని సూచించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన నిత్యవసర సరుకులను ఎక్కువ మొత్తంలో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముంపుకు గురైన పసుపు, అరటి, కంద పంటలను పరిశీలిస్తూ ఎన్యుమరేషన్ చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు.
ఇరిగేషన్ శాఖ కేసి డివిజన్ ఈఈ రవి కిరణ్, మోపిదేవి తహసిల్దార్ హరనాథ్, ఎంపీడీవో స్వర్ణలత, చల్లపల్లి తాసిల్దార్ వనజాక్షి, ఉద్యాన శాఖ అధికారులు కీర్తి దేవ్, రమేష్, అగ్రికల్చర్ ఆఫీసర్ మురళీకృష్ణ, వైద్య సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News