మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ ఛాంబర్ లో పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య, ఇంజనీరింగ్ పనుల పురోగతిపై సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మచిలీపట్నం గుడివాడ ఉయ్యూరు పెడన పట్టణ ప్రాంతాల్లో 10 ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు మచిలీపట్నం ఉయ్యూరు పెడనలలో ఒక్కొక్కటి చొప్పున ఆరోగ్య కేంద్రాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 7 కేంద్రాల లో కొన్ని వివిధ దశలలో నిర్మాణంలో ఉండగా గుడివాడలో ఒక కేంద్రం టెండర్ల దశలో ఉందన్నారు. మచిలీపట్నంలోని నారాయణపురంలో స్థలం త్వరితగతిన ఎంపిక చేయాలన్నారు. మిగిలినవన్నీ సత్వరమే పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
తాడిగడప మునిసిపాలిటీలో కానూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించుటకు ప్రత్యామ్నాయ స్థలాన్ని వెంటనే గుర్తించాలన్నారు. అమృత్ 2.0 పథకం కింద మచిలీపట్నం గుడివాడ పెడన తాడిగడప మున్సిపాలిటీలలో 181.31 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను చేపట్టాలన్నారు. భూగర్భ మురికినీటి వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తాగునీటి పైపులతో కలవకుండా చూడాలని, ఎక్కడ వైపుల లీకేజీ ఉండరాదని కాంట్రాక్టర్లు వాటిని సరిగా నిర్మిస్తున్నారా లేదా సచివాలయ సౌకర్యాల కార్యదర్శి బాధ్యతగా చూసుకోవాలన్నారు.
మచిలీపట్నంలో ఇంకను మిగిలిపోయిన 30 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్థాల చెత్తగుట్టలను కూడా తొలగించేందుకు సత్వరమే తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పెడన మున్సిపాలిటీలో 10 రోజుల్లో పూర్తిగా చెత్తను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తను పూర్తిగా తొలగించిన ప్రదేశం దురాక్రమణకు గురి కాకుండా గట్టి నిఘా ఉంచి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం గుడివాడ తాడిగడప ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, మనోహర్ రావు, నజీర్, రామారావు, ప్రజారోగ్య శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, డి ఈ ప్రవీణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News