గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైన్లు ఆక్రమణ చేసి మురుగు, వర్షం నీటి పారుదలకు అడ్డుగా ఉన్నవాటిని స్వచ్చందంగా తొలగించాలని, లేకుంటే ప్రజా సౌకర్యార్ధం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక సిబ్బంది, అధికారులు తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ పట్టాభిపురం మెయిన్ రోడ్, అమరావతి రోడ్, విజయపురి కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్ ఆక్రమణలను పరిశీలించి, వాటి తొలగింపుకు ఆక్రమణదారులు, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రైన్ల ఆక్రమణలను తొలగించామని, అందువల్లనే వర్షం కురిసిన కొద్ది సమయానికే నీరు బెయిల్ అవుట్ అవుతుందన్నారు. కాని ఇప్పటికే పలుమార్లు తొలగించుకోవాలని సూచించినప్పటికీ కొందరు ప్రధాన డ్రైన్లను ఆక్రమణ చేసి వ్యాపారాలు చేస్తున్నారని, అటువంటి ఆక్రమణలను తక్షణం తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అమరావతి రోడ్ లోని హిందూ ఫార్మసీ కాలేజి ఎదుట డ్రైన్ మీద ఉన్న ఆక్రమణను ఇప్పటికీ 3 పర్యాయాలు తొలగించినా, తిరిగి ఏర్పాటు చేయడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఆక్రమణలను తక్షణం తొలగించి, ఆక్రమణలు పునరావృతం కావడంపై విచారణ చేసి, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. వార్డ్ సచివాలయాల వారీగా ఇప్పటికే వర్షం నీరు కాల్వలోకి వెళ్లడం లేదని, ఇళ్లు మునుగుతున్నాయని, రోడ్ల మీద వర్షం నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ప్రజల నుండి విపరీతమైన ఫిర్యాదులు అందుతున్నా, డ్రైన్లపై ఆక్రమణల తొలగింపుపై పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకు అని ప్రశ్నించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం 202, 137 సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, 137 శానిటేషన్ కార్యదర్శి క్షేత్ర స్థాయిలో విధుల్లో ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు.
పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News