Breaking News

నాగవరం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నాగవరం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరం పంచాయతీ, పెడన నియోజకవర్గం గూడూరు మండలం ముకొల్లు పంచాయతీ సరిహద్దులో ఉన్న నాగవరం గ్రామాన్ని సందర్శించారు. అక్కడి గ్రామ ప్రజలతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నాగవరం గ్రామస్తులు మాట్లాడుతూ రెండు నియోజకవర్గాలు రెండు మండలాలు రెండు గ్రామపంచాయతీలలో నాగవరం గ్రామం సరిహద్దు గ్రామంగా ఉండడంతో తాము ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నాగవరం గ్రామం ఒకవైపు గ్గుడ్లవల్లేరు మండలం వేమవరం పంచాయతీ పరిధిలో 250 మంది జనాభా ఉన్నారని, మరోవైపు గూడూరు మండలం ముకొల్లు పంచాయితీ పరిధిలో 169 మంది జనాభా ఉన్నారన్నారు. ముకొల్లు పంచాయతీలో మొత్తం1429 మంది జనాభా ఉన్నారన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న మంచినీటి పథకం ద్వారా రెండు రోజులకు ఒకసారి నీరు సరఫరా చేస్తున్న అందరికీ సరిపోవటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు.
గ్రామ మొదటి లో ఉన్న శివాలయం నుండి గ్రామం లోపలికి రావడానికి చీకటిగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మనవి చేశారు. అంతేకాకుండా సరైన రహదారి లేకపోవడంతో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందన్నారు.

దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ నాగవరం గ్రామంలోని ప్రజలు గ్రామసభ నిర్వహించుకుని వారి కోరిక మేరకు అందరూ గుడ్లవల్లేరు మండలం వేమవరం పంచాయతీలో ఉంటామనేటట్లుగా సానుకూలంగా తీర్మానాలు చేసి పంపిస్తే, వాటిని మండల పరిషత్, జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాల్లో ఆమోదించుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు ఆమోదించేటట్లుగా అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. సరిహద్దు సమస్య లేకుండా ఆ విధంగా పరిష్కరిస్తామన్నారు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామంలో మంచినీటి కోసం ప్రస్తుతం ఉన్న చిన్న పైపులైనుకు అదనంగా మరో పైపులైను ఏర్పాటు చేసి గ్రామస్తులకు సరిపడే విధంగా నీటిని సరఫరా చేయిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు

గ్రామంలో 2.5 కిలోమీటర్ల మేరకు సరైన రహదారి ఏర్పాటు చేయిస్తామని జిల్లా కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇస్తూ సిమెంటు రోడ్లు, తారు రోడ్లు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. అలాగే గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వీధి దీపాలు ఏర్పాటు విషయమై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరఫున అన్ని పనులు చేయిస్తామని గ్రామస్తులు చెత్తాచెదారాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి గ్రామపంచాయతీ సిబ్బందికి అందజేసి స్వచ్ఛఆంధ్ర ఉద్యమానికి సహకరించాలని కోరారు.

తదనంతరం గ్రామస్తులందరూ జిల్లా కలెక్టర్ తమ గ్రామానికి వచ్చి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు అందరూ హర్షద్వానాల మధ్య కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డ్వామా పిడి శివప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈ సోమేశ్వరరావు, ఈ ఈ నటరాజు గుడ్లవల్లేరు గూడూరు ఎంపీడీవోలు ఇమ్రాన్, శైలజ, నాగవరం సర్పంచ్ పద్మావతి, పంచాయతీరాజ్ ఏఈ నాగేశ్వరరావు నాగవరం ముకొల్లు పంచాయతీ కార్యదర్శులు దుర్గా నాగమల్లేశ్వరరావు, బాపూజీ, ఏఎన్ఎం ప్రభావతి పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *