Breaking News

కొరమీను చేపల సాగుతో రైతుకు అదనపు ఆదాయం..

-సాగుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
-జిల్లా కలెక్టర్

చినమొత్తేవి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయంతో పాటు అనుబంధంగా కొరమీను చేపల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని, సాగుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు.

బుధవారం ఆయన మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, గ్రామానికి చెందిన చిత్తూరి కస్తూరిబాయి 10 సెంట్ల స్థలంలో చేపట్టిన కొరమేను సాగును పరిశీలించారు. ట్యాంకులోని చేప పిల్లలను ఆసక్తిగా పరిశీలించి సాగుకు సంబంధించిన వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు చేసే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవనోపాదులను మెరుగుపరిచే వివిధ కార్యక్రమాలను చేపడుతోందన్నారు.

దీనిలో భాగంగా కొరమీను చేపల సాగును చేపట్టేందుకు రుణాలను అందించి ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తోందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. తక్కువ స్థలంలోనే పెంచవచ్చని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో, తక్కువ పెట్టుబడితో లాభదాయకంగా ఉంటుందన్నారు. ఉదయ్ ఆక్వా కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, అవసరమైన సీడ్ సరఫరాతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఎకరం లేదా రెండు ఎకరాలు కలిగిన రైతులు 10 సెంట్ల స్థలంలో చెరువును తవ్వుకొని సాగు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద రూ.4.40 లక్షల రుణాన్ని అందించడంతోపాటు 35 శాతం సబ్సిడీ రాయితీలను అందిస్తుందన్నారు.

మొదటగా ప్రత్యేక ట్యాంకులో నాలుగు నెలల వరకు చేప పిల్లను పెంచాలని, తర్వాత వాటిని ఏర్పాటు చేసుకున్న చెరువులో బదిలీ చేసి మరో నాలుగు నెలల అనంతరం కేజీ సైజుకు పెరుగుతుందన్నారు. కేజీ రూ. 250 నుంచి రూ. 300 వరకు ధర పొందవచ్చు అని అన్నారు. బయట ఆశించిన ధర లభించకపోతే ఉదయ్ ఆక్వా కంపెనీయే మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేస్తుందని తెలిపారు. చెరువులోని నీటిని పొలాలకు వినియోగించుకోవడం ద్వారా ఎరువుల వినియోగం కూడా తగ్గుతుందన్నారు. చెరువును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తవ్వించుకోవచ్చని, ఆసక్తిగల రైతులు వెలుగు సంస్థ ఏపీఎం లేదా సీసీలను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. గ్రామంలో చిత్తూరి కస్తూరిబాయి చేపట్టిన సాగును సందర్శించి స్ఫూర్తి పొందాలని సూచించారు.

సమావేశంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, మొవ్వ మండల తహసిల్దారు మస్తాన్, ఎంపీడీవో దయ్యాల సుహాసిని, మొవ్వ ఎంపీపీ కొండేటి ఇందిరా, గ్రామ సర్పంచ్ కొమ్ము సౌదామణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *