Breaking News

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, కమిటీ సభ్యులతో కలిసి ఆయన పౌర హక్కుల రక్షణ చట్టం 1955, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నివారణ చట్టం 1989, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల అమలు తీరును చర్చించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల వివరాలు, బాధితులకు తక్షణ పరిహారం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల విషయంలో ఎలాంటి జాప్యం చేయకుండా సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ క్రమంలో ఆయన జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎన్ని నమోదయ్యాయి, వాటిలో ఎన్ని చార్జిషీట్లు ఫైల్ చేశారు, కేసులను ఫైల్ చేయడంలో జాప్యానికి గల కారణాలు, ఇప్పటివరకు అట్రాసిటీ బాధితులకు నష్టపరిహారం ఎంత అందించారని ఆయన డివిజన్ల వారీగా సమీక్షించారు.

బందరు డివిజన్ లో 14 కేసులు, గుడివాడ 6, గన్నవరం 10, అవనిగడ్డ డివిజన్ లో 5 కలిపి మొత్తం జిల్లాలో 35 కేసులు విచారణలో ఉన్నాయని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు షేక్ షాహిద్ బాబు వివరించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో 31 మంది బాధితులకు రూ.66.23 లక్షలు పరిహారం ప్రభుత్వం ద్వారా అందించినట్లు కమిటీకి తెలిపారు.

పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్య పథకం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు.

గూడూరు మండలంలోని కంచకోడూరు, పఠాన్ పేట, అదేవిధంగా వలందపాలెం, నవీన్ మిట్టల్ కాలనీ తదితర గ్రామాలలో సరైన శ్మశాన వాటికలు లేవని, వాటికి రహదారులు, ప్రహరీ గోడలు నిర్మించాలని గుమ్మడి విద్యాసాగర్ తదితర కమిటీ సభ్యులు కలెక్టర్ ను కోరారు. దీనిపై ఆయన స్పందించి అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సమావేశంలో డీఆర్వో కె చంద్రశేఖర రావు, ఏఎస్పీ వీవీ నాయుడు, కే ఆర్ ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం డీఎస్పీలు సిహెచ్ రాజా, టి విద్యశ్రీ, ధీరజ్ వినీల్, సిహెచ్ శ్రీనివాసరావు, మచిలీపట్నం ఆర్డీవో కే స్వాతి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, కమిటీ సభ్యులు గుమ్మడి విద్యాసాగర్, వేణుగోపాల్, మహమ్మద్ బాజీ, నక్క విజయబాబు, పి వెంకటేశ్వరరావు, కొండ నాగేశ్వరరావు, నరేష్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *