రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాషా పరిరక్షణకు అంకితభావంతో కృషి – స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకిత మవుతున్నానని ఉప కులపతి డి. మునిరత్నం నాయుడు పేర్కొన్నారు. గురువారం ఉదయం రాజమహేంద్రవరం స్థానిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ఆచార్య డి. మునిరత్నం నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, సాహిత్యవేత్తలు పాల్గొన్నారు. ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆచార్య డి. మునిరత్నం నాయుడు మాట్లాడుతూ, తెలుగు భాషా పరిరక్షణ, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని, ఈ సందర్భంగా తనకు ఎంతో ప్రేరణనిచ్చిన స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పునరంకితమవ్వడం తమ అదృష్టమని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ మానస పుత్రిక అని, ఆయన కలలలోని తెలుగు తల్లి గౌరవం పెంచే ఆవిష్కరణలలో ఒకటని గుర్తుచేశారు. తమిళనాడులో తమిళ విశ్వవిద్యాలయం స్థాపనకు స్పూర్తిగా, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొదట మహిళా విశ్వవిద్యాలయం, అనంతరం తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమానాభివృద్ధి దృష్ట్యా రాజమహేంద్రవరం, శ్రీశైలం, వరంగల్, హైదరాబాద్‌లలో విభిన్న పీఠాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
మొదటి ఉపకులపతి ఆచార్య దోణప్ప శతజయంతి ఉత్సవాలు ఈ ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం పరిధిలో 22 విభాగాలు ఉన్నాయని, అందులో భాషా పీఠం, చరిత్ర–సంస్కృతి పీఠం ముఖ్యమైనవని పేర్కొన్నారు. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని, రాజమహేంద్రవరం కేంద్రంలో తెలుగు ఎం.ఏ., శ్రీశైలంలో సంస్కృతి, చరిత్ర విభాగాల్లో ఎం.ఏ., పీహెచ్‌డీ, అలాగే కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో నృత్యానికి సంబంధించిన సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
సాంకేతిక పరమైన అడ్డంకులు అధిగమించి మిగిలిన కోర్సులు కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నా మని పేర్కొన్నారు. మానవ వనరుల నియామకా లలో భాగంగా రిజిస్ట్రార్, ఇతర ప్రధాన విభాగాల అధికారులను, ఇతర సిబ్బంది నియామకాలు పూర్తి చేసుకుని, 2026 జనవరి నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషా అభివృద్ధి కోసం పనిచేస్తున్న 400కిపైగా సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకుని, తెలుగు భాషను ప్రోత్సహించేందుకు అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు.
అదే విధంగా నవోదయ పాఠశాలలు, సీబీఎస్ఈ పాఠశాలల్లో మూడవ భాషగా తెలుగు బోధన ప్రవేశపెట్టడం జరుగుతోందని వెల్లడించారు. మాతృభాషలో విద్యా బోధనే ఎన్టీఆర్ ఆశయం – గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, మాతృభాషలో విద్యా బోధన చేయాలనే దృఢమైన సంకల్పమే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమైనప్పటికీ, విద్యా బోధన మాత్రం మాతృభాషలో జరగాలని ఆయన ఆకాంక్షించారని చెప్పారు. రాష్ట్ర విభజన వలన కొంతకాలం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా, ప్రస్తుతం వాటిని అధిగమించి తెలుగు విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.
ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం ఆక్రమణలో ఉన్న భూములకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రారంభానికి ముందే బీటీ రోడ్డు పనులు చేయాలని భావించామని చెప్పారు. త్వరలో లైబ్రరీ అభివృద్ధి, ప్రాంగణంలో మౌలిక సదుపాయాల కల్పన, రహదారి అనుసంధానం, భవన మరమ్మత్తులు, పెయింటింగ్ వంటి పనులకు చర్యలు చేపడతామని వివరించారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అవసరమైన గ్రాంట్ విడుదల చేయనున్నారని తెలిపారు. ఆ సందర్శనకు ముందు చేపట్టవలసిన పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విశ్వవిద్యాలయాధికారులను కోరారు. యూనివర్శిటీ అభివృద్ధి కోసం తన పరిధిలో రూ.30 లక్షల నిధులు సమీకరించినట్లు తెలిపారు. భూములను సర్వే చేయించి, హద్దులు గుర్తించి కాంపౌండ్ వాల్ నిర్మాణం, విజ్ఞాన కేంద్రంగా ప్రాంగణాన్ని మలచడం, ఆక్రమణల తొలగింపు, సిబ్బంది–విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన పరిధిలోనే అదనంగా రూ.50 లక్షల నిధులు సమీకరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజనలో తెలుగు విశ్వవిద్యాలయం నష్టపోయిన సంస్థల్లో ఒకటని గుర్తు చేశారు. ఇంగ్లీష్ భాష అనుసంధాన భాషగా ఉపయోగపడవచ్చునిగాని, ప్రధాన బోధనా భాష మాత్రం తెలుగు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు మాతృభాషలోనే బోధన వ్యవస్థలు అమలు చేస్తున్నాయని ఉదాహరణగా పేర్కొన్నారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని సంకల్పించిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అన్నారు. తెలుగు భాష పరిరక్షణకు ఎన్టీఆర్ ప్రారంభించిన ఉద్యమమే ఈ విశ్వవిద్యాలయ స్థాపనకు మూలమని గుర్తు చేశారు. ఈ సందర్భంలో పీఠాధిపతి శ్రీశైలం ప్రాంగణం డాక్టర్ ముసుగు శ్రీనివాస్ రావు, పారిస్ తెలుగుపై పరిశోధన చేసిన డేనియల్ నెజర్స్, ఓ. ఎస్. డి. డాక్టర్ వి. నిరీక్షణ బాబు, తెలుగు విశ్వ విద్యాలయం ప్రముఖ కవి డాక్టర్. బిక్కి కృష్ణ, ప్రముఖ కూచిపూడి గురువులు దుర్గాప్రసాద్ రావు, ప్రిన్సిపాల్ కూచిపూడి, డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం మురళి రత్నాల, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News