మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు మోoతాతుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీలు వీవీ నాయుడు, సత్యనారాయణలతో కలసి తుఫాను ముందస్తు సన్నద్ధత సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోoతా తుఫాను కారణంగా జిల్లాలో ఈనెల 27, 28, 29 తేదీలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షంతో పాటు వేగంగా గాలులు కూడా వీస్తాయన్నారు.
ఆ గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు పడిపోయే అవకాశం ఉందని, విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పడిపోయిన చెట్ల వలన రాకపోకలకు ముఖ్యంగా నిత్యవసర సరుకుల రవాణాకు ఇబ్బంది కలుగుతుందని, ఆ చెట్లను తొలగించేందుకు అవసరమైన రంపాలు, క్రేన్లు, రవాణా వాహనాలు తదితర సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, మండలాల్లో తహసీల్దారులు ఇన్సిడెంట్ కమాండర్లుగా వ్యవహరించి ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు మండలాల్లో ఉండి పనులు పర్యవేక్షించాలన్నారు.
వరద ముంపు ప్రాంతాలు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదలు వచ్చినప్పుడు పంట కాలువలు డ్రైనేజీ కాలువలు ద్వారా సముద్రం లోకి వరద నీరు ప్రవహిస్తుందని మార్గమధ్యలో కాలువలు తెగిపోకుండా ముందుగానే బలహీనంగా ఉన్న వాటిని పటిష్ట పరచాలన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని స్పష్టం చేశారు. ఎవరైనా వెళ్లి ఉంటే వెనక్కు తిరిగి వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గజ ఈతగాళ్లను ముందుగా మాట్లాడుకుని, పడవలను లైఫ్ జాకెట్లను తదితర సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ జియో మొబైల్ టవర్లు సజావుగా పనిచేసేలా చూడాలని, ఒకవేళ విద్యుత్కు అంతరాయం కలిగితే జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మంచినీటి సరఫరా పథకాల జలాశయాల్లో ఎప్పటికప్పుడు నీటిని నింపుకోవాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నింటిలో విద్యుత్ సరఫరా నిర్వహణ సజావుగా జరగాలని, అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సురక్షిత పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, పాముకాటు మందులు తదితర కావలసిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వాట్సాప్ గ్రూపులలో అధికారులందరికీ సూచనలు ఎప్పటికప్పుడు పంపడం జరుగుతుందని వాటిని గమనించుకొని క్షేత్రస్థాయిలో సజావుగా అమలయేల చూడాలన్నారు.
మండల స్థాయి అధికారులందరూ, వీఆర్వోలు సచివాలయ సిబ్బంది వారి ప్రధాన కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా జడ్పీ సీఈవో డిఎల్డిఓ, ఎంపీడీవోలను ఆర్డీవోలు తాసిల్దారులను చూసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 08672 252572 ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని అదేవిధంగా ఆర్డీవో కార్యాలయంలోనూ మండల తహసిల్దార్ కార్యాలయంలోనూ కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివరాల నివేదికను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి చేరవేయాలన్నారు.
డివిజన్ స్థాయిలో తుఫాను, వరదలకు సంబంధించిన వార్తలు సర్కులేట్ అవుతుంటే వాటిపై వెంటనే స్పందించి తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా డ్రోన్లు అవసరమైతే వాటిని తప్పకుండా వినియోగించాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ అధికారి వారి కింది సాయి సిబ్బంది ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్నపిల్లలు అంగన్వాడికి కేంద్రానికి రాకుండా వారికి ఇవ్వవలసిన పాలు గుడ్డు తదితర పోషకాహారాలను వారి ఇంటి వద్దకే చేరవేయాలన్నారు.
గొర్రెలు, మేకలు తదితర పశువుల పెంపకం దారులు వారి ఇంటి వద్దనే ఉంచుకునేలా సమాచారం పంపించాలన్నారు.
సహాయ పునరావాస కేంద్రాలకు చౌక దుకాణాలను అనుసంధానం చేయాలన్నారు పునరావస కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న ప్రదేశాల్లో ఆహారం వండేందుకు పంటవాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు
వచ్చే వారంలో ప్రసవించనున్న గర్భవతులను రాకపోకులకు ఇబ్బంది కలగకుండా డయాలసిస్ కిమోతెరపి రోగులను కూడా ముందుగానే ఆసుపత్రులలో చేర్పించాలన్నారు. రహదారులు గాని వంతెనలు గాని కాజ్వేలు గాని గండిపడే అవకాశం ఉన్నచోట రాకపోకలు జరగకుండా సిబ్బందిని నియమించి నియంత్రించాలన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన యంత్ర పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.పారిశుద్ధ్య కార్మికులకు ఉపయోగపడే వస్తువులను ముందుగానే కొనుగోలు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
గాలికి పడిపోయే బలహీనంగా ఉన్న హోర్డింగులను గాని పాత ఫ్లెక్సీలు గాని తొలగించాలన్నారు. వాహనాల రవాణా కోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పడిపోయే అవకాశం ఉన్న శిధిలమైన భవనాలు గాని పాత భవనాలను గాని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు
సంయుక్త కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ బియ్యం పప్పు నూనె తదితర నిత్యవసర సరుకులు ఈనెల 26వ తేదీ ఆదివారం సాయంత్రంలోగా అన్ని చౌక దుకాణాలకు తప్పనిసరిగా చేరవేయాలన్నారు. ఈ విషయంలో ఆర్డీవోలు సంబంధిత ఆర్డీవోలు తహసీల్దారులు ఎలాంటి సమస్య రాకుండా పర్యవేక్షించాలన్నారు
ఈ సమావేశంలో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు స్వాతి,బాలసుబ్రమణ్యం, హేలా షారోన్, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఎస్ ఈ లు సోమశేఖర్, రమణ రావు, రహదారులు భవనాల ఈఈ లోకేష్, జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనందరావు, డిఎస్ఓ మోహన్ బాబు, పౌరసరగాల సంస్థ జిఎం శివరాం ప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్ ఈ సత్యానందం, డిఆర్డిఏ ద్వామా పి డీలు హరిహరనాద్, శివప్రసాద్, డిపిఓ డాక్టర్ జై అరుణ, మెప్మా పీడీ సాయిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, డీఈవో రామారావు, జిల్లా రవాణా అధికారి శ్రీనివాసు,ఎస్సీ ఎస్టీ సంక్షేమ అధికారులు షాహిద్ బాబు, ఫణి ధూర్జటి, బీసీ సంక్షేమ అధికారి రమేష్ తదితర జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు డిఎల్డిఓ లు, తహసిల్దారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News