నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజలలోనికి తీసుకువెళ్లేందుకు సమర్ధవంతంగా పనిచేయాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కంభంపాటి రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఓల్డ్ ఎంప్లాయిస్ కాలనీ లోని నూతన భవనంలోకి మారిన సమాచార శాఖ డివిజినల్ పౌర సంబంధాధికారి కార్యాలయంను బుధవారం ఆర్డీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సమాచార శాఖ ప్రభుత్వానికి ప్రజలకు సమాచార వారధిగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమంలో పేద ప్రజల సంక్షేమం కోసం అమ్మ ఒడి, ఆసరా, జగనన్న ఇళ్ళు , వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రైతు భరోసా, సామజిక పెన్షన్లు వంటి ఎన్ని పధకాలను అమలు చేస్తున్నాదని , వాటిని అర్హులైన పెదాలు సద్వినియోగం చేసుకునేలా ఆ పధకాలను విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత సమాచార శాఖపై ఉందన్నారు. అంతేకాక ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఆ మేరకు నూజివీడు డివిజన్లలోని సమాచార శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. సమాచార శాఖ సిబ్బంది, ప్రభుత్వ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులతో సమన్వయము చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో విజయభారతి స్కూల్ లోని సమాచార శాఖ కార్యాలయాన్ని ఓల్డ్ ఎంప్లాయిస్ కాలనీ లోని గృహ నిర్మాణ శాఖ డీ.ఈ కార్యాలయం సమీపంలోని మార్చడం జరిగిందన్నారు. అనంతరం కార్యాలయంను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసారు. కార్యక్రమంలో డివిజినల్ పౌర సంబంధాధికారి సిహెచ్. దుర్గా ప్రసాద్, సిబ్బంది సౌరీ ప్రసాద్, శారద , మీడియా ప్రతినిధులు రవీంద్రకుమార్ రెడ్డి, రామమోహనరావు, రవికాంత్, ప్రభృతులు పాల్గొన్నారు.
