Breaking News

వ్యాపారవేత్తలుగా తయారు అయ్యేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యాపారవేత్తలుగా తయారు అయ్యేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, యువతకు ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొని పైకి ఎదగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్భోదించారు.

మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పెదఈర్లపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 17 జిల్లాలలో 50 ఎం ఎస్ ఎం ఈ పార్కులను వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేసిన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో బాపులపాడు మండలం వేలేరు వీరవల్లి గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పనున్న శ్రీ వేద ఇన్నోవేషన్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్కు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం మండలం రుద్రవరం లోని కృష్ణ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అకాడమిక్ బ్లాకులోనీ శ్రీ అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో కార్యక్రమం జరిగింది.

తొలుత దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ , ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, తదితర ప్రముఖులు పూలమాలలువేసి పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వ్యాపారవేత్త తత్వం ద్వారానే సాధ్యమవుతుందన్నారు.
ప్రతి ఒక్క విద్యార్థి చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడమే కాకుండా ఒక మంచి ఆలోచనతో వ్యాపారవేత్త కూడా కావచ్చన్నారు.
చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి పెద్ద వ్యాపారం చేసి గొప్ప వ్యాపారవేత్తగా తయారు కావచ్చని ధీరుబాయ్ అంబానీ జీవిత చరిత్రను విశదీకరించి తెలిపారు.
గతంలో వ్యాపారం చేయాలంటే చాలా కష్టంగా ఉండేదని అదే నేడు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు.
పరిశ్రమలు నెలకొల్పుట కోసం పిఎంఈజీపి కింద 40 శాతం రాయితీ, 60 శాతం బ్యాంకు రుణాలు అందిస్తోందన్నారు.
పీఎంఎఫ్ఎంఈ, ముద్ర వంటి పలు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందచేస్తుందన్నారు.
జిల్లాలో చిన్న చిన్న వ్యాపారస్తులను గుర్తించి వారికి సహకారం అందించి మరింత వ్యాపారం పెంపొందించుకునేందుకు ప్రణాళిక రూపొందించామని అందులో మొదట్లో 150 మందికి అనుకున్నప్పటికీ 300 మంది ఎంపిక అయ్యారని వారిలో ఇప్పటికే 70 మందికి రుణ సహాయం అందించే విధంగా అనుసంధానం చేశామన్నారు.
నేటి యువత చెడు అలవాట్లకు బానిస కారాదని హితవు పలుకుతూ వారికి అవకాశాలు చాలా ఉన్నాయనీ వాటిని అందిపుచ్చుకొని పైకి ఎదగాలన్నారు.
విజయం రాత్రికి రాత్రి దక్కదని కొంత ఓపికగా అంకితభావంతో సవాలుగా తీసుకొని కృషి చేస్తే తప్పకుండా విజయం దక్కుతుందన్నారు.
ఆకాశమే హద్దుగా యువత ముందుకు వచ్చి యువ పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలన్నారు.
వారి ద్వారా పదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
శ్రీ వేద ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రాష్ట్రంలో నెలకొల్పుతున్న మొట్టమొదటి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ అని అన్నారు.

రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ తాను కూడా చదువు కంటే వ్యాపారానికి ప్రాధాన్యతని ఇచ్చానని చెబుతూ స్వయం ఉపాధి ద్వారా పరిశ్రమలు పెట్టి పదిమంది కి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
ప్రభుత్వం రుణాలు, స్థలాలు, విద్యుత్ తదితర సౌకర్యాలను కల్పించి సహకారం అందిస్తుందన్నారు.
మచిలీపట్నానికి మహర్దశ ఉందని, ఓడరేవు ఆధారిత పరిశ్రమలు రాబోతున్నాయన్నారు.
మనం తయారు చేసే ఉత్పత్తులను ఎగుమతులు చేసుకోవడానికి ఓడరేవు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున వస్తున్నారన్నారు.

పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ మన రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తి, స్ఫూర్తి, పెట్టుబడి అని కొనియాడారు.
మొదటి దశలో పామర్రు నియోజకవర్గంలోని ఐనంపూడిలో ఎం ఎస్ ఎం ఈ పార్కు శంకుస్థాపన జరిగిందని వచ్చే 6 నెలల్లో పూర్తవుతుందన్నారు.
తాను ఏదైనా మంచి చేయాలని ఆలోచించే లోపే జిల్లా కలెక్టర్ ముందుండి ఆ పని చేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు.
ప్రతి ఒక్కరు శ్రమించడంతోపాటు స్మార్ట్ గా పనిచేస్తే అనుకున్నది సాధ్యమవుతుందని, తిరిగే ఉండదని స్పష్టం చేశారు.
ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ ఎవరైనా సరే పైకి రావాలంటే కోరిక, క్రమశిక్షణ, పట్టుదల ఉండాలన్నారు.
తాను 5 వ తరగతి వరకు చదివి ఈ స్థాయికి వచ్చానంటే అందుకు మనం చేసే పనిలో అంకితభావం ఉండాలన్నారు.
పనిచేసే సంస్థకు నమ్మకంగా ఉండాలన్నది చాలా ముఖ్యమన్నారు. సెల్ఫోన్లను అవసరం మేరకే వినియోగించాలని హితవు పలికారు.

సిప్రా ల్యాబ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వేద ఇన్నోవేషన్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నింటికంటే చదువుకోవడం కష్టమని, ఒక ఆలోచనతో వ్యాపారం మొదలుపెట్టి సులభంగా చేయవచ్చన్నారు.
ఎవరైనా యువకులు పారిశ్రామికవేత్తలుగా కావాలంటే తన ప్రోత్సాహం ఉంటుందని, వారి ఆలోచనలకు మెంటార్లను జోడించే ఏర్పాట్లను చేస్తామన్నారు.
తన పరిశ్రమ ద్వారా 4,500 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కే రామ్ జి, డీఐసీ జీఎం ఆర్ వెంకటరావు, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ దీవన్, రిజిస్ట్రార్ ఆచార్య ఉష, రెక్టార్ ఆచార్య బసవేశ్వర రావు, డీఐసీ డిడి నాగేశ్వరరావు, ఎన్ఐసి అధికారులు సెల్వినా, ఫణి కుమార్, తహసిల్దారు మధుసూదన్, పారిశ్రామికవేత్తలు పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *