-స్థాయి సంఘాల సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ప్రధమంగా రెండు, మూడు, నాలుగు స్థాయి సంఘ సమావేశాలు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య వైద్యం అంశాలపై సమీక్ష జరగగా, భోజన విరామం అనంతరం 5, 6 స్థాయి సంఘ సమావేశాలు స్త్రీ సంక్షేమం రక్షణ, సాంఘిక సంక్షేమం, ఒకటి ఏడు స్థాయి సంఘ సమావేశాలు ప్లానింగ్ ఆర్థికం, పనులు అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణ, రహదారులు, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల అభివృద్ధి తదితర సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని దాదాపు 18 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు మంజూరు కాలేదని, కారణం తెలపాలని గన్నవరం కో ఆప్షన్ సభ్యులు గౌస్ అధికారులను ప్రశ్నించగా, ప్రస్తుతం అందుకు లాగిన్ లు ఇంకా రాలేదని, ఈ డిసెంబర్ మాసం చివరి నాటికి మంజూరు చేస్తామని డిఆర్డిఏ అధికారులు తెలిపారు. అదేవిధంగా తమ సమస్యలు చెప్పుకునేందుకు సంబంధిత శాఖల అధికారులు ఎందుకు హాజరు కావడంలేదని సభ్యుడు వివరణ కోరగా, దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేలా లేఖ తయారు చేయాలని జడ్పీ సీఈవో తన సిబ్బందికి సూచించారు. జడ్పీ స్థాయి సంఘాలు లేదా సర్వసభ్య సమావేశం చట్టబద్ధంగా జరిగేవని, అత్యంత ప్రాధాన్యత అంశంగా భావించి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జెడ్పీ సీఈవో కన్నమనాయుడు ఆదేశించారు. మండలంలోని గ్రామాల్లో బ్లీచింగ్ కాకుండా సున్నం చల్లుతున్నారని సభ్యుడు ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
డ్వాక్రా మహిళలకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదని, బ్యాంక్ కు వెళితే వెలుగు కార్యాలయాన్ని సంప్రదించాలంటున్నారని, దీనివల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఓ మహిళా సభ్యురాలు లేవనెత్తగా, డ్వాక్రా మహిళలకు సబ్సిడీ రుణాలు అంటూ ఏమీ ఉండవని, అయితే వ్యాపారాల నిమిత్తం మహిళలకు పిఎంఈజీపి, పిఎఫ్ఎంఐ పథకాల ద్వారా 35 శాతంతో కూడిన రాయితీ రుణాలు అందించడం జరుగుతుందని ఆసక్తి గలవారు వినియోగించుకునే విధంగా సూచించాలని అధికారులు సభ్యులను కోరారు.
గూడూరు మండలంలో మల్లవోలు, గరువు గ్రామాలలోని కొత్తగా గృహాలు నిర్మించుకుంటున్న వారికి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల లబ్ధిదారులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, మంజూరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మండల జడ్పిటిసి వేముల సురేష్ సంబంధిత అధికారులను కోరారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు వివరణ ఇస్తూ చాలామందికి బిల్లులు పడుతున్నాయని, లేవనెత్తిన అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సొంత స్థలం ఉండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై) పథకం కింద ఇల్లు నిర్మించుకునే వారికి గడువు నవంబర్ 5వ తేదీతో ముగుస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల లబ్ధిదారులకు అదనపు సాయం అందిస్తుందని వివరించారు. దీనిపై జెడ్పీ చైర్ పర్సన్ స్పందిస్తూ గ్రామాల్లో దండోరా వేయించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు.
అదేవిధంగా గూడూరు గ్రామంలో చెత్తను తెచ్చి స్మశానంలో వేస్తున్నారని ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారి ఇబ్బందికరంగా తయారయ్యిందని సభ్యుడు వివరించారు. చెత్త డంపింగ్ కోసం స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈవో తెలిపారు.
తుపానుకు దెబ్బతిన్న పంటలకు సంబంధించిన ఎన్యూమరేషన్ పారదర్శకంగా జరగలేదని రైతులు ఆరోపిస్తున్నారని, పడిపోయిన పంటకు మాత్రమే కాకుండా నిలబడిన పొలాలు సైతం గింజలు రాలిపోయి నష్టం వాటిల్లిందని, కొన్ని పాలు పోసుకోక తప్పలుగా మారాయని, ప్రభుత్వానికి వాస్తవాలను వివరిస్తూ నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా చూడాలని జడ్పీ చైర్పర్సన్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్యం చేయించుకుంటున్న రోగులను ఆసుపత్రులు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. రోగులు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని, నగదు డిమాండ్ చేసినట్లయితే తమకు ఫిర్యాదు చేయాలని తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సుమన్ ఫోన్ నంబర్ 9281068152, అదేవిధంగా కృష్ణాజిల్లాలో డాక్టర్ సతీష్ 9440701873 ఫోన్ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
సభ్యుల గౌరవ వేతనమునకు సంబంధించి 15 నెలల పాత బకాయిలు రావాల్సి ఉందని, మంజూరయ్యే విధంగా చూడాలని సభ్యులు కోరారు. ప్రస్తుతం రాబోయే 3 నెలలకు గౌరవ వేతనం ఇచ్చేందుకు బడ్జెట్ ఉందని, పెండింగ్ బకాయిల కోసం కృషి చేస్తున్నట్లు జెడ్పి సీఈవో వివరణ ఇచ్చారు.
సమావేశంలో డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, పలువురు జడ్పిటిసి సభ్యులు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News