మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నీరు పేదలకే పింఛన్లు, బియ్యం కొనుగోలుకు ఇబ్బంది పడే వారికే బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని అన్నారు.
శుక్రవారం మంత్రి తమ కార్యాలయం వద్దకు వివిధ సమస్యలతో వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కొన్ని సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందికి సూచించారు.
కరెంటు బిల్లులు, ఐటి రిటన్స్ వంటి కారణాలతో పింఛన్లు నిలుపు చేశారని పలువురు మంత్రిని కలసి విన్నవించగా నిలుపుదల చేసిన పింఛన్లు కారణాలు తెలుసుకుని అర్హత ఉంటే పునఃరుద్దరించడం జరుగుతుందని, ప్రభుత్వం పేదరికం కారణంగా ఎలాంటి ఆదాయం లేక జీవనం కష్టంగా మారిన వారికి సామాజిక పింఛన్లు, బియ్యం కొనుగోలు శక్తి లేని వారికి రైస్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు, అంతేకాని ఆదాయం ఉన్నవారికి కాదని మంత్రి అన్నారు. కరెంటు కనెక్షన్లు ఆధార్ తో లింక్ చేసిన సందర్భాలలో జరిగిన పొరపాట్లు కారణంగా ఒకే ఆధార్ కి రెండు మూడు మీటర్లు లింక్ అయ్యాయని వాటిని సరి చేస్తున్నారని అన్నారు. పిల్లలు సాఫ్టువేర్ ఇంజనీర్లు అయినప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికి పేరెంట్స్ పింఛన్లు పొందుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఇలాంటి అనర్హతగల వాటిని ప్రక్షాళనం చేయడం జరుగుతుందని అర్హత కలిగి ఉన్న వారికి తప్పని సరిగా పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు.
బందరు మండలం చినకరగ్రహారం పల్లెపాలెం సొసైటి ప్రసిడెంట్ కొక్కిలిగడ్డ నాంచారయ్య గ్రామ పెద్దలతో మంత్రిని కలసి పల్లెకారుల సమస్యలు వివరించి గ్రామంలో పొంత ఇళ్లులేని పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, సరుగుడుతోటలు సాగు చేసుకునే వారి భూములు ఆన్‌లైన్ చేయించాలని, మంత్రిగారు గతంలో శాసన సభ్యులుగా ఉండగా ఇప్పించిన ఇళ్ల పట్టాలు 78 పట్టాలను ఆన్ లైన్ చేయించాలని మంత్రిని కోరారు.
బందరు మండలం ఎస్ఎన్ గొల్లపాలెం దళిత వాడలో సిటిసిఎన్ సి ప్రాధమిక ఎయిడెట్ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలగా మార్పించి కొనసాగించాలని కోరుతూ మాజీ సర్పంచు ఎంఎం నాంచారయ్య, సిహెచ్ రామచంద్రరావులు మంత్రికి విన్నవించారు.
Prajavartha Online Telugu News