మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న దిత్వా తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హిన్ జాహిద్, డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీ సత్యనారాయణలతో కలిసి తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దిత్వా తుఫాను నేపథ్యంలో జిల్లాకు తీవ్రమైన హెచ్చరిక వచ్చిందన్నారు. దిత్వా తుఫానుకు మోంతా తుఫానుకు కొంత తేడా ఉందన్నారు. మోంత తుఫాను గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీచాయన్నారు. అయితే ద్విత్వా తుఫాను వలన అటువంటి గాలులు ఉండవని అధికంగా వర్షపాతం నమోదవుతుందన్నారు. గల తుఫాను మాదిరిగానే అన్ని జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోవాలన్నారు. ఈ వర్షంతో ఇళ్ళ చుట్టూ గాని, పంట పొలాల లో గాని నీరు నిలవడం జరుగుతుందన్నారు. దాన్ని ఒక సవాలుగా తీసుకొని వర్షపు నీటిని వెంటనే బయటకు తొలగించేందుకు ముందస్తుగా పాట్లు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను, దెబ్బతిన్న ఇళ్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.
చెట్లు పడిపోయి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా గతంలో మాదిరిగా జెసిబిలను, విద్యుత్ రంపాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాలో పరిస్థితులలో నైనా ఎక్కడా కూడా ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోకూడదని స్పష్టం చేశారు. ఏ జిల్లాలో లేనంతగా మన జిల్లాలో టార్పాలిన్ పట్టలను సేకరించామన్నారు. పక్వానికి రాకుండానే ఏ రైతు వరి పంట కోతలు కోయకుండా చూడాలన్నారు. వరి పంట కోసి ఉంటే ఆ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించే ఏర్పాటు చేయాలన్నారు. అలా వీలుకాని పక్షంలో వర్షానికి ధాన్యం తడవకుండా రైతులకు వెంటనే టార్పాలిన్ పట్టలు పంపిణీ చేయాలన్నారు.
మార్కెట్ యార్డ్ గోదాములు గాని సహకార సంఘాల గోదాములు గాని లేదా సమీపంలోని ఏదైనా మంచి భవనాలలోకైనా సురక్షితంగా ధాన్యాన్ని తరలించి భద్రపరచాలన్నారు. టార్పాలిన్ పట్టలు లేక దాన్యం తడిసిపోయిందని రైతు ఇబ్బంది పడకుండా భరోసా కల్పించాలన్నారు. ఎక్కడైనా దాన్యం తడిస్తే టార్పాలిన్ పట్టలు ఇచ్చారా లేదా అని విచారించి అందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈసారి శనివారం, ఆదివారం రెండు రోజులు అధికారులందరూ వారి కార్య స్థానాల్లో అందుబాటులో ఉండి తుఫాను సహాయక కార్యక్రమాలను ముందస్తుగా చేపట్టాలన్నారు. వీలైనంత ఎక్కువ మోతాదులో ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. అన్ని స్థాయిల్లోనూ వాహనాలు సిద్ధంగా ఉంచుకొని ధాన్యాన్ని మిల్లులకు పంపించాలన్నారు. రానున్న దిత్వా తుఫాను గురించి రైతులందరికీ సంపూర్ణ అవగాహన కలిగించి ధాన్యం రక్షించే బాధ్యత వ్యవసాయ అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు సముద్రం లోపలికి వెళ్లకుండా సూచనలు తెలపాలన్నారు. సముద్రంలో చేపలు వేటకు ఇదివరకే వెళ్లిన మత్స్యకారులను వెంటనే తీరానికి పిలిపించాలన్నారు. మురికి కాలువలు అన్నీ పూడికలు తీసివేసి నీటి ప్రవాహం సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా, వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పశువులకు గతంలో మాదిరే నష్టం జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
మండల ప్రత్యేక అధికారులు ఇప్పటినుండే వారికి కేటాయించిన మండలాల్లో పర్యటించి ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించేలా చూడాలన్నారు. గర్భవతులు, డయాలసిస్ రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ముందుగానే ఆసుపత్రులకు చేరవేయాలన్నారు. వర్షాలకు పాములు వచ్చే అవకాశం ఉన్నందున పాముకాటు విరుగుడు మందును అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉంచాలన్నారు.
సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే క్షేత్రాధికారులందరితో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించామన్నారు. జిల్లాలో రైతులు 1,90,000 రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్నారు. జిల్లాలో 1.55 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారంటూ ఇప్పటివరకు 50 వేల హెక్టార్లలో వరి పంటలు కోత కోయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. వచ్చే 2 వారాల్లో ధాన్యం సేకరణ 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు.
జిల్లాలో మొత్తం 7,600 టార్పాలిన్ పట్టలు అందుబాటులో ఉన్నాయని, మండలాల వారీగా వాటిని పంపిణీ చేస్తున్నామని, ఎవరికి ఎన్ని కావాలన్నా సరఫరా చేయుటకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రతి రైతు సేవ కేంద్రం పరిధిలో 20 పట్టలు దాకా అందుబాటులో ఉంచామన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసే రైతులకు కావలసిన తార్పాలిన్ పట్టలను అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు రమణ రావు, సోమశేఖర్, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, డీఎస్ఓ మోహన్ బాబు, ఆర్డిఓ స్వాతి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, డిపిఓ అరుణ, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, బీసీ సంక్షేమ అధికారి రమేష్, మార్క్ఫెడ్ డి ఎం మురళీకృష్ణ, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్ తదితర జిల్లా అధికారులు ఆన్లైన్లో క్షేత్రాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News