గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో నూతన ఏడాది నుండి ప్రతి ఇంటి నుండి తడిపొడిగా వ్యర్ధాలు విభజన చేసే జిఎంసికి అందించే లక్ష్యంతో ప్రజలకు అవగాహన కల్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ప్రజారోగ్య కార్మికులు, మెప్మా రీసోర్స్ పర్సన్స్ కి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ, సాహస్, వాష్ స్వచ్చంద సంస్థలు శనివారం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని డిఆర్ఎం కన్వెన్షన్ హాల్లో ప్రజారోగ్య కార్మికులు, మెప్మా రీసోర్స్ పర్సన్స్ కి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుండి వ్యర్ధాల విభజన జరగడం వలన ప్రజారోగ్య విభాగంలో పెనుమార్పులు వస్తాయన్నారు. తడి వ్యర్ధాలతో ఎరువు, పొడి వ్యర్ధాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా వ్యర్ధాల నిర్వహణ తేలికవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వార్డ్ సచివాలయాల వారీగా ప్రజలకు అవగాహన కల్గించడానికి మెప్మా ఆర్పీలను కేటాయించి, వారికి తగిన పారితోషికం కూడా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన సాహస్, వాష్ స్వచ్చంద సంస్థలు వారం రోజుల పాటు గుంటూరు నగరంలోని ప్రజారోగ్య కార్మికులు, ఆర్పీలకు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో కెపాసిటి బిల్డింగ్ ఇంచార్జి ఎం.అర్జున్ ప్రసాద్, రీసోర్స్ పర్సన్ బివి.రావు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు బి.రామా కాంత్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News